
పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)కి పద్ధతులు తెలియవని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) అన్నాడు. ఎదుటి వ్యక్తులను కించపరిచే సంకుచిత స్వభావం కలవాడంటూ ఘాటు విమర్శలు చేశాడు. తనకైతే షాహిద్ ఆఫ్రిది పట్ల సదభిప్రాయం లేదని.. ఇందుకు అతడి చెత్త ప్రవర్తనే కారణమంటూ కుండబద్దలు కొట్టాడు.
కాగా ఆల్‌రౌండర్‌గా షాహిద్ మెరుగ్గా రాణించినా.. మైదానంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో ముఖ్యంగా టీమిండియా ప్లేయర్లతో అతడి ప్రవర్తన ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)తో అతడికి క్షణం పడేది కాదు. వీలు చిక్కినప్పుడల్లా భారత ఆటగాళ్లను రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడేవాడు షాహిద్.
నా గురించి తప్పుగా మాట్లాడాడు
ఈ క్రమంలోనే ఓసారి మైదానం వెలుపల కూడా తనను కించపరిచేలా షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యలు చేశాడని ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించాడు. లలన్‌టాప్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో షాహిద్ ఆఫ్రిదిని 11 సార్లు అవుట్ చేశాను. ఓసారి హర్షా భోగ్లేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు నా గురించి తప్పుగా మాట్లాడాడు.
తనకు తాను నిజమైన పఠాన్‌గా చెప్పుకొన్న షాహిద్.. నేను రియల్ పఠాన్ కాదంటూ చెత్తగా మాట్లాడాడు. అక్కడ అతడు కేవలం నన్ను మాత్రమే కాదు.. నా తల్లిదండ్రులను కూడా కించపరిచాడు. నిజానికి అతడు అలా మాట్లాడి ఉండకపోతే.. తనతో నాకసలు ఎలాంటి గొడవా లేదు.
చెత్త ప్రవర్తన
కానీ ఎప్పుడైతే వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ తప్పుగా మాట్లాడాడో అప్పుడే.. అతడిని ఎప్పుడైనా, ఎక్కడైనా అవుట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. సిరీస్ విజేతను తేల్చే కీలక మ్యాచ్‌లలో.. వరల్డ్‌కప్ ఫైనల్‌లో.. ఇలా మేజర్ ఈవెంట్లలో అతడి వికెట్ తీశాను.
అయితే, అతడితో నేరుగా మాట్లాడేందుకు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతడి వికెట్ ఎంత త్వరగా.. వీలైతే అంత త్వరగా తీయడం మాత్రమే నాకు తెలుసు. అయితే, ఓసారి కరాచి నుంచి లాహోర్‌కు వెళ్తున్న విమానంలో అతడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు.
అప్పుడు కూడా నా వెనుక నుంచి వచ్చి.. నా జట్టులోకి వేళ్లు పోనిచ్చి.. ‘ఎలా ఉన్నావు పిల్లోడా’ అంటూ పలకరించాడు. అప్పుడు కూడా షాహిద్‌కు హుందాగా మాట్లాడటం చేతకాలేదు’’ అంటూ ఇర్ఫాన్ పఠాన్ షాహిద్ ఆఫ్రిది ప్రవర్తనను విమర్శించాడు.
బరోడా ఆల్‌రౌండర్
కాగా 40 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్. అదే విధంగా.. ఎడమచేతి వాటం బ్యాటర్. టీమిండియా తరఫున అంతర్జాతీయ స్థాయిలో 2003- 2012 వరకు క్రికెట్ ఆడాడు.
తన కెరీర్‌లో మొత్తంగా 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇర్ఫాన్ పఠాన్.. ఆయా ఫార్మాట్లలో 100, 173, 28 వికెట్లు తీశాడు. అదే విధంగా.. టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20లలో 172 పరుగులు సాధించాడు.
వన్డేల్లో అత్యుత్తమంగా
మరోవైపు.. షాహిద్ ఆఫ్రిది 1996- 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ తన కెరీర్‌లో 27 టెస్టుల్లో 48 వికెట్లు, 1716 పరుగులు చేశాడు. 99 టీ20 మ్యాచ్‌లలో 98 వికెట్లు తీయడంతో పాటు 91 పరుగులు సాధించాడు.
అయితే, వన్డేల్లో మాత్రం ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్‌లో 398 వన్డేలు ఆడిన షాహిద్ ఆఫ్రిది.. 395 వికెట్లు పడగొట్టడంతో పాటు.. 8064 పరుగులు సాధించాడు.