
Courtesy: IPL
హార్ధిక్ పాండ్యా విషయంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. హార్ధిక్‌ను రిటైన్ చేసుకున్నామని గుజరాత్ టైటాన్స్ ప్రకటించిన రెండు గంటల్లోపే ముంబై ఇండియన్స్ తాము హార్దిక్‌ను తిరిగి దక్కించుకున్నామని వెల్లడించింది. హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ ద్వారా దక్కించుకున్నట్లు తెలుస్తుంది. హార్దిక్‌ను ట్రేడింగ్ చేసుకున్నందుకుగాను ముంబై యాజమాన్యం గుజరాత్ ఫ్రాంచైజీకి భారీ మొత్తం చెల్లించిందని సమాచారం.
హార్దిక్‌కు లభించే 15 కోట్లతో (ప్రతి సీజన్ గుజరాత్ హార్ధిక్‌కు చెల్లించే మొత్తం) పాటు అతని విడుదల కోసం భారీ మొత్తాన్ని ముంబై మేనేజ్‌మెంట్ గుజరాత్ యాజమాన్యానికి చెల్లించనుందని తెలుస్తుంది. హార్దిక్ సొంతగూటికి చేరడం పట్ల ముంబై ఇండియన్స్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ టైటన్స్‌కు రాకముందు (2015-2021) హార్దిక్ ఆరేళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిథ్యం వహించాడు.
2022లో తొలిసారి గుజరాత్‌కు ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ తొలి సీజన్‌లోనే తన కెప్టెన్సీలో ఆ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అనంతరం 2023 సీజన్‌లో హార్దిక్ నేతృత్వంలో గుజరాత్ రన్నరప్‌గా నిలిచింది. హార్దిక్ తిరిగి ముంబై గూటికి చేరడంపై క్రికెట్ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. గుజరాత్ యాజమాన్యంతో ఆర్ధిక పరమైన విభేదాలు ఉన్న కారణంగానే హార్దిక్ ముంబై ఇండియన్స్ పంచన చేరాడని టాక్ నడుస్తుంది.