'వైభవ్‌' ఆట మొదలవుతుందా! | Indias first T20 against Ireland today | Sakshi
Sakshi News home page

'వైభవ్‌' ఆట మొదలవుతుందా!

Jun 26 2026 3:22 AM | Updated on Jun 26 2026 3:22 AM

Indias first T20 against Ireland today

కుర్రాడి అరంగేట్రంపై అందరి దృష్టి

నేడు ఐర్లాండ్‌తో భారత్‌ తొలి టి20

భారత జట్టు ఐర్లాండ్‌తో టి20 మ్యాచ్‌ ఆడుతుందంటే తుది ఫలితం గురించి ప్రత్యేకంగా ఆలోచించనవసరం లేదు. ఈ ఫార్మాట్‌లో సంజూ సామ్సన్, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ల విధ్వంసకర ఆటపై కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఐర్లాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దానికి ఒకే ఒక్కడు కారణం. 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ భారత సీనియర్‌ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తాడా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. అసలు భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడిని ఏ స్థానంలో, ఎవరిని తప్పించి ఆడిస్తుందనేది చూడాలి.   

బెల్‌ఫాస్ట్‌: టి20 ప్రపంచకప్‌లో రెండోసారి విజేతగా నిలిచిన తర్వాత భారత జట్టు తమ తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు సిద్ధమైంది. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి పోరులో భారత్‌ తలపడుతుంది. వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులోనే లేని శ్రేయస్‌ అయ్యర్‌... ఐపీఎల్‌లో కనబర్చిన నాయకత్వ ప్రదర్శనతో ఇప్పుడు తొలిసారి భారత టి20 జట్టుకు సారథిగా బరిలోకి దిగుతున్నాడు. గతంలో రెండు మ్యాచ్‌లలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన లోర్కాన్‌ టకర్‌ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐర్లాండ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. 

మ్యాచ్‌ జరిగే సీఎస్‌సీసీ గ్రౌండ్‌లో నెమ్మదైన పిచ్‌ ఉంది. బౌండరీలు కూడా పెద్దవి కాబట్టి రికార్డు స్కోర్లకు అవకాశం తక్కువగా ఉంది.  టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచిన సామ్సన్, విధ్వంసక ఆటకు చిరునామా అయిన అభిషేక్‌ శర్మ ఓపెనింగ్‌ చేయడం ఖాయం. వరల్డ్‌ కప్‌లో, ఆపై ఐపీఎల్‌లో కూడా చెలరేగిన ఇషాన్‌ కిషన్‌ మూడో స్థానంలో ఆడతాడు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఒకరిని తప్పిస్తే గానీ వైభవ్‌కు చోటు లభించదు. ఐదు, ఆరు స్థానాల్లో శ్రేయస్, తిలక్‌ వర్మ బరిలోకి దిగుతారు. 

అయితే ఎలాగైనా అతడిని ఆడించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తే ఒక బౌలర్‌ లేదా ఆల్‌రౌండర్‌ను తప్పించే అవకాశం ఉంది. కాబట్టి వాషింగ్టన్‌ సుందర్, అక్షర్‌ పటల్‌లలో ఒకరిని తప్పిస్తే వైభవ్‌కు స్థానం దక్కుతుంది. అర్ష్ దీప్, హర్షిత్‌ రాణా, ప్రసిధ్‌ కృష్ణ ప్రధాన బౌలర్లు కాగా, ఐదో బౌలర్‌ కోటాను శివమ్‌ దూబే పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ, ఐపీఎల్‌ ప్రదర్శనను కలిపి చూస్తే ప్రత్యర్థికంటే భారత్‌ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. 

మరోవైపు ఐర్లాండ్‌లో పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. అనుభవవజ్ఞులైన టకర్, హ్యారీ టెక్టర్, డాక్‌రెల్, డెలానీలపై జట్టు ఆధారపడుతోంది. ఇద్దరు కొత్త ఆటగాళ్లు రూబెన్‌ విల్సన్, జై ముంద్రా ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఐర్లాండ్‌ జట్టులోని సభ్యులెవరూ భారత్‌పై టి20ల్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. 

15 ఏళ్ల 91 రోజులు
వైభవ్‌ సూర్యవంశీ ప్రస్తుత వయసు. ఈ మ్యాచ్‌లో అతను ఆడితే భారత్‌ తరఫున పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన పురుష క్రికెటర్‌గా సచిన్‌ టెండూల్కర్‌ (16 ఏళ్ల 205 రోజులు) రికార్డును వైభవ్‌ అధిగమిస్తాడు.

8 భారత్, ఐర్లాండ్‌ జట్ల మధ్య ఇప్పటి వరకు 8 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 8 మ్యాచ్‌ల్లోనూ భారత జట్టే గెలిచింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement