నేడు ఆ్రస్టేలియాతో భారత మహిళల మ్యాచ్
టి20 ప్రపంచకప్
లండన్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు అసలైన సవాల్‌కు సిద్ధమైంది. సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను భారత్ ఢీకొంటోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్ సెమీస్ చేరడం లాంఛనమే కాగా... ఈ గ్రూప్1లో రెండో జట్టుగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య పోటీ ఉంది. అయితే సఫారీలకంటే హర్మన్ సేన రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి మన మ్యాచ్‌కు ముందు ఒక వేళ బంగ్లాదేశ్‌ను దక్షిణాఫ్రికా ఓడించినా... రన్‌రేట్ సమస్యలు రాకుండా ఆసీస్‌ను భారత్ ఓడిస్తే సరిపోతుంది.
అయితే ఈ టోర్నీలో ఇప్పటి వరకు జట్టు ప్రదర్శన, ఆటగాళ్ల వ్యక్తిగత ఫామ్‌ను చూస్తే టీమిండియా పరిస్థితి గొప్పగా లేదు. బలహీన జట్లు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను సులువుగా ఓడించిన భారత్ దక్షిణాఫ్రికా చేతిలో భంగపడింది. ఆపై బంగ్లాదేశ్‌లాంటి టీమ్‌పై కూడా లక్ష్య ఛేదనలో తడబడింది. ఈ నేపథ్యంలో ప్లేయర్లంతా తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా నాలుగు మ్యాచ్‌లలో కలిపి 85 పరుగులే చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తన స్థాయికి తగ్గట్లు ఆడటం అవసరం.
షఫాలీ, స్మృతి దూకుడుగానే ఆడుతున్నా... జెమీమా, యస్తిక, రిచా నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. దీంతో పాటు బౌలింగ్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీచరణి మాత్రమే నిలకడగా రాణిస్తుండగా, మిగతావారంతా విఫలమయ్యారు. ఇలాంటి స్థితిలో ఆసీస్‌ను మన జట్టు ఎలా నిలువరిస్తుందనేది ఆసక్తికరం. వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం ఇప్పుడు అమ్మాయిలకు స్ఫూర్తినివ్వాలి.


