భారత మహిళల జట్టుకు బెర్త్‌ | Indian womens cricket team qualifies for 2028 Olympics T20 cricket event | Sakshi
Sakshi News home page

భారత మహిళల జట్టుకు బెర్త్‌

Jun 30 2026 3:46 AM | Updated on Jun 30 2026 3:46 AM

Indian womens cricket team qualifies for 2028 Olympics T20 cricket event

2028 ఒలింపిక్స్‌ టి20 క్రికెట్‌ ఈవెంట్‌కు అర్హత  

న్యూఢిల్లీ: లాస్‌ ఏంజెలిస్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌కు భారత మహిళల క్రికెట్‌ జట్టు అర్హత సాధించింది. ఆసియా ఖండంలో అత్యుత్తమ ర్యాంక్‌ ఉన్న జట్టుగా టీమిండియాకు అవకాశం దక్కింది. వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పునరాగమనం చేయనుండగా... టి20 ఫార్మాట్‌లో జరిగే క్రికెట్‌ ఈవెంట్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో చెరో 6 జట్లు పాల్గొనబోతున్నాయి. మహిళల విభాగంలో భారత్‌తో పాటు వేర్వేరు ఖండాల నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆ్రస్టేలియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా అర్హత సాధించాయని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 

ఆతిథ్య జట్టు హోదాలో అమెరికాకు కూడా అవకాశం లభించింది. అయితే వెస్టిండీస్‌ జట్టుకు అర్హత కల్పించే విషయంలో మాత్రం ఐసీసీ ఆచితూచి అడుగు వేస్తోంది. వెస్టిండీస్‌ను ఒకే టీమ్‌గా ఐసీసీ గుర్తించగా... ఒలింపిక్స్‌ విషయంలో మాత్రం ఆ జట్టుకు అవకాశం లభించడం కష్టంగా మారింది. ఆంటిగ్వా, బార్బడోస్, గయానా, జమైకా తదితర వేర్వేరు దేశాలతో కూడిన ఆటగాళ్లను ఒకే జట్టుగా ఎంచుకొని విండీస్‌ టీమ్‌ క్రికెట్‌ ఆడుతుంది.

అయితే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) దృష్టిలో ఇవన్నీ వేర్వేరుగా గుర్తింపు పొందిన దేశాలు. కాబట్టి నేరుగా వెస్టిండీస్‌కు పాల్గొనే అవకాశం లేదు. అవసరమైతే ఈ అన్ని జట్ల మధ్య పోటీ నిర్వహించి కరీబియన్‌ నుంచి ఒకే టీమ్‌ను ఎంపిక చేస్తామని ఐసీసీ ప్రకటించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement