వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న దివ్య | Indian Divya Deshmukh Wins World Junior Girls Chess Title | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న దివ్య

Jun 13 2024 7:00 PM | Updated on Jun 13 2024 7:32 PM

Indian Divya Deshmukh Wins World Junior Girls Chess Title

గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్‌ జూనియర్‌ (అండర్‌-20 అమ్మాయిల విభాగం) చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత నంబర్‌ 3 క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల దివ్య.. ఫైనల్‌ రౌండ్‌లో బల్గేరియాకు చెందిన బెలొస్లావా క్రస్టేవాపై విజయం సాధించి వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 11 పాయింట్లకు గానూ 10 పాయింట్లు సాధించిన దివ్వ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.

ఈ పోటీలో దివ్య తెల్ల పావులతో బరిలోకి దిగింది. గత నెలలో షార్జా ఛాలెంజర్స్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత దివ్యకు ఇది వరుసగా రెండో టైటిల్‌ కావడం విశేషం. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో దివ్య తర్వాతి స్థానంలో 20 ఏళ్ల ఆర్మేనియా క్రీడాకారిణి మరియమ్‌ నిలిచింది. మరియమ్‌ 11 పాయింట్లకు గాను 9.5 పాయింట్లు సాధించింది. 

మూడో స్థానంలో అజర్‌ బైజాన్‌కు చెందిన అయాన్‌ అల్లావెర్దియేవా నిలిచింది. ఈమె ఖాతాలో 8.5 పాయింట్లు ఉన్నాయి. భారత్‌కు చెందిన షుబి గుప్తా, రక్షిత రవి 8, 7.5 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన దివ్య రెండు డ్రాలు, తొమ్మిది విజయాలు సాధించి,  తన ఎనిమిదో జూనియర్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement