చెస్‌లో చరిత్ర సృష్టించిన 11 ఏళ్ల బోధన శివానందన్‌ | Bodhana Sivanandan Youngest Female International Master-Break-38 Yrs-Old-Record | Sakshi
Sakshi News home page

చెస్‌లో చరిత్ర సృష్టించిన 11 ఏళ్ల బోధన శివానందన్‌

Oct 24 2026 11:31 AM | Updated on Oct 24 2026 11:37 AM

Bodhana Sivanandan Youngest Female International Master-Break-38 Yrs-Old-Record

Photo Credit: Twitter

భారత సంతతికి చెందిన బ్రిటన్ చెస్ క్రీడాకారిణి బోధన శివానందన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 11 ఏళ్ల వయసులోనే బోధన ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) హోదా పొందింది. తద్వారా అత్యంత పిన్న వయస్కురాలిగా ఐఎమ్ హోదా పొంది రికార్డులకెక్కిన బోధన శివానందన్ పనిలో పనిగా 38 ఏళ్ల రికార్డును కూడా బద్దలుకొట్టింది. గతంలో జుడిట్ పోల్గర్ (1988లో) పేరిట ఈ రికార్డు ఉండేది.

"యూరోపియన్ ఉమెన్స్ చెస్ క్లబ్ కప్ 2026లో ఫైనల్ రౌండ్‌లో విజయం సాధించి ఇంటర్నేషనల్ మాస్టర్‌గా నిలిచిన 11 ఏళ్ల బోధన శివానందన్‌కు అభినందనలు. బోధన 'షీ ప్లేస్ టు విన్ లయొనెస్సెస్' తరఫున బోర్డ్ 1లో 7కి 5.5 స్కోరు సాధించి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తద్వారా IM టైటిల్ గెలుచుకున్న చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా క్రీడాకారిణిగా నిలిచింది" అని యూరోపియన్ చెస్ యూనియన్ రాసుకొచ్చింది.

ఓవరాల్ జాబితాలో బోధన ఏడో స్థానంలో నిలిచింది. భారత్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్లు ఆర్ ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేష్, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్, అర్జెంటీనాకు చెందిన ఫౌస్టినో ఓరో, టర్కీకి చెందిన యాగిజ్ కాన్ ఎర్డోగ్మస్ , రష్యాకు చెందిన రోమన్ షోగ్డ్జీవ్ ఉన్నారు.

బోధన తల్లిదండ్రులు తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందినవారు. ఉపాధి నిమిత్తం 2007లో యూకేకి వలస వెళ్లగా.. లండన్‌లో జన్మించిన బోధన ఐదేళ్ల వయసులోనే చెస్ బోర్డుతో పరిచయం ఏర్పరచుకుంది. ఆ తర్వాత క్రమంగా ఆటపై మక్కువ పెంచుకుని అంచెలంచెలుగా ఎదిగింది. తన అతితక్కువ కెరీర్‌లో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (WIM), ఉమెన్ ఫైడ్ మాస్టర్ (WFM) వంటి రికార్డులతో పాటు, గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతి పిన్న వయస్కురాలిగానూ బోధన గుర్తింపు తెచ్చుకుంది.

 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement