‘హి’..స్టోరీఆమిర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పిలుచుకునే స్టార్ ఆమిర్ ఖాన్. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల కలెక్షన్లు కూడా అందుకునేలా సినిమాలు తీసే వ్యూహాలు పన్నడంలో మాత్రమే కాదు చదరంగంలో ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తులు వేయడంలోనూ దిట్టే. ఆయనకు చిన్నప్పటి నుంచీ చెస్ పట్ల అమితాసక్తి. ఇప్పటికీ తరచు ఆన్ లైన్ లో లేదా బహిరంగ ప్రదేశాల్లో చెస్ ఆటలో మునిగి తేలడం సహచరులకు కనిపిస్తుంటుంది. కారులో ప్రయాణిస్తూ, ల్యాప్‌టాప్‌లో చెస్ ఆడుతూ అలా ఆడుతూనే కారు దిగడం ద్వారా ఆయన కెమెరాలకు చిక్కి ఇటీవలే వార్తల్లో నిలిచారు కూడా. కారు దిగుతూ కూడా తన ల్యాప్‌టాప్‌లో ఎత్తులు పైఎత్తులు వేస్తూ చెస్ ఆడుతున్న ఆమిర్ వీడియో వైరల్‌గా మారి అభిమానుల్ని అలరించింది.
అమ్మమ్మే ఆది గురువు...
ఈ లగాన్ స్టార్‌కు చిన్నతనంలోనే చదరంగంలో ఆయన అమ్మమ్మ ఆదిగురువుగా మారి చెస్ నేర్పించారు, అప్పటి నుంచీ అది ఆయన జీవిత కాలపు అభిరుచిగా మారింది. ఆయన తరచు తనను తాను ఒక ఔత్సాహిక (అమెచ్యూర్) ఆటగాడిగా చెప్పుకుంటారు.. అయితే ఆ ఆట పట్ల అంకితభావంతోపాటు తగిన నైపుణ్యం కూడా ఆయనకు ఉందని సన్నిహితులు, ఆయనతో చెస్ ఆడినవారు చెబుతుంటారు.
గ్రాండ్ మాస్టర్‌తో... బాలీవుడ్ స్టార్...
లక్షలాది అభిమానులను కలిగి ఉన్న ఈ బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్, తాను మాత్రం చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు వీరాభిమానిగా చెప్పుకుంటారు. అంతేకాదు వీరిద్దరూ గత కొన్నేళ్లుగా కలుస్తూ, సరదాగా చెస్ మ్యాచ్‌లు కూడా ఆడుతుంటారు. ఆమిర్ ఒక చదరంగం ఆటకు అసలు సిసలైన అభిమాని అని, సిసలైన ఆటగాడిలాగా ఆటలో రక్షణ వ్యూహాల గురించి కూడా తనతో చర్చిస్తుంటారని ఆనంద్ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. భిన్నరంగాల ప్రముఖులతో బాలీవుడ్ స్టార్స్‌కు రకరకాల అనుబంధాలు ఉండొచ్చు గానీ చెస్ ఆడటమే ఆమిర్ అనుబంధంగా చెప్పొచ్చు. ప్రముఖులతో చెస్ ఆడడం తనకు ఇష్టమని ఆమిర్ అంటారు. బాలీవుడ్ అందాల నటి కత్రినాకైఫ్‌తో అనేకసార్లు చెస్‌లో పోటీ పడిన అమీర్... ఆమె చాలా బాగా ఆడతారని ప్రశంసిస్తారు. అలాగే హాస్యనటుడు సమయ్ రైనాతో ఆడిన ఒక సరదా మ్యాచ్ గురించి కూడా ఆయన ప్రస్తావిస్తారు. అంతేకాకుండా, ఆయన తన షూటింగ్ సిబ్బంది, సెట్‌లో అందుబాటులో ఉన్న యువతీ యువకులతో సైతం కళ్లకు గంతలు కట్టుకుని మరీ చెస్ ఆడటం విశేషం.
డ్రమ్... మరో సరదా...
తన సినిమా ‘పీప్లీ లైవ్’ సంగీత ఆవిష్కరణ కార్యక్రమంలో డ్రమ్మర్‌గా కనిపించిన బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన చిన్ననాటి కల నిజమైందని పేర్కొన్నారు. ఆ సందర్భంగా ‘ఇండియన్ ఓషన్’ బ్యాండ్‌కు చెందిన డ్రమ్మర్ అమిత్ కిలామ్, తమ పాటలను ప్రదర్శిస్తున్నప్పుడు ‘‘నాకు డ్రమ్స్ వాయించడం బోర్ కొట్టింది, మా కోసం ఆమిర్ ఖాన్ వచ్చి డ్రమ్స్ వాయించాలి’’ అని అనౌన్స్ చేశాడు. ఏమాత్రం ఆలోచించలేదు ఆమిర్. వెంటనే వేదికపైకి వెళ్ళి డ్రమ్స్ వాయించాడు. కరణ్ జోహార్, అశుతోష్ గోవారికర్, రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా, ప్రసూన్ జోషి, రాజ్‌కుమార్ హిరాణి, రాణి ముఖర్జీ, అతుల్ కులకర్ణి, రోనీ స్క్రూవాలా వంటి బాలీవుడ్ ప్రముఖులు, అతిథులను ఆమిర్ కచేరీ అమితంగా అలరించింది.
– సత్యబాబు, సాక్షి, హైదరాబాద్


