మళ్లీ ఓడిన భారత బ్యాడ్మింటన్‌ జట్టు | Indian badminton team loses again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన భారత బ్యాడ్మింటన్‌ జట్టు

Apr 30 2025 3:55 AM | Updated on Apr 30 2025 3:55 AM

Indian badminton team loses again

ప్రతిష్టాత్మక సుదిర్మన్‌ కప్‌ ప్రపంచ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత జట్టు కథ ముగిసింది. చైనాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసి నాకౌట్‌ దశకు చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. డెన్మార్క్‌తో జరిగిన గ్రూప్‌ ‘డి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో 1–4తో ఓడిన భారత్‌... ఇండోనేసియా జట్టుతో మంగళవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లోనూ 1–4తో ఓడిపోయింది. 

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన డెన్మార్క్, ఇండోనేసియా జట్లు గ్రూప్‌ ‘డి’ నుంచి నాకౌట్‌ దశకు అర్హత పొందాయి. ఇండోనేసియాతో జరిగిన పోటీలో మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి మ్యాచ్‌లో ధ్రువ్‌–తనీషా క్రాస్టో 10–21, 21–18, 21–19తో రెహాన్‌–గ్లోరియాలపై గెలిచి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించారు. అయితే రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 12–21, 13–21తో పుత్రి కుసుమ వర్థిని చేతిలో ఓడిపోయింది. 

మూడో మ్యాచ్‌లో ప్రణయ్‌ 21–19, 14–21, 12–21తో క్రిస్టీ చేతిలో ఓటమి చెందాడు. నాలుగో మ్యాచ్‌లో శ్రుతి–ప్రియా ద్వయం 10–21, 9–21తో ల్యానీ ట్రియా–సితి ఫాదియా జంట చేతిలో ఓడింది. ఐదో మ్యాచ్‌లో హరిహరన్‌–రూబన్‌ 20–22, 18–21తో షోహిబుల్‌ –డానియల్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.   

Advertisement
 
Advertisement
Advertisement