
వన్డే సిరీస్ సొంతం చేసుకున్న భారత మహిళల ‘ఎ’ జట్టు
రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టుపై విజయం
రాధ, యస్తిక, తనూజ అర్ధ సెంచరీలు
మూడు వికెట్లతో రాణించిన మిన్ను మణి
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్ కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు... వన్డే సిరీస్‌లో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన రెండో వన్డేలో భారత ‘ఎ’ జట్టు 2 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.
స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (87 బంతుల్లో 91; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కిమ్ గార్త్ (41 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో మిన్ను మణి 46 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా ... సైమా ఠాకూర్ 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. టిటాస్ సాధు, రాధా యాదవ్, ప్రేమ రావత్, తనూజ కన్వర్‌లకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత మహిళల ‘ఎ’ జట్టు 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసి గెలిచింది.
కెప్టెన్ రాధ యాదవ్ (78 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (71 బంతుల్లో 66; 9 ఫోర్లు), తనూజ కన్వర్ (57 బంతుల్లో 50; 3 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో కదంతొక్కారు. షఫాలీ వర్మ (4), ధారా గుజ్జర్ (0), తేజల్ హసబ్నిస్ (19), రాఘ్వీ బిస్త్ (14) విఫలమయ్యారు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఆరంభంలో యస్తిక ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఆ తర్వాత ఆ బాధ్యతను రాధ యాదవ్ సక్రమంగా నిర్వర్తించగా... ఆఖర్లో తనూజ అదరగొట్టింది. అర్ధశతకం అనంతరం రాధా యాదవ్ అవుట్ కావడంతో భారత జట్టు 193/7తో నిలిచింది.
ఇక ఛేదన కష్టమే అనుకుంటున్న తరుణంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తనూజ కన్వర్ చక్కటి ఆటతీరుతో చెలరేగింది. ప్రేమ రావత్ (33 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 68 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించింది. చివరి ఓవర్ తొలి బంతికి తనూజ అవుట్ కావడంతో ఉత్కంఠ నెలకొన్నా... ప్రేమ రావత్ విజయానికి కావాల్సిన 5 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగానే జట్టును గెలిపించింది. ఇదే వేదికపై బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత ‘ఎ’ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం ఇక్కడే జరగనుంది.