వైభవ్‌ నిరాశపరిచినా, టీమిండియా భారీ స్కోర్‌ | India U19 Team All Out For 540 Runs In First Innings Of 1st Youth Test Against England U19 Team | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ నిరాశపరిచినా, టీమిండియా భారీ స్కోర్‌

Jul 13 2025 6:19 PM | Updated on Jul 13 2025 6:27 PM

India U19 Team All Out For 540 Runs In First Innings Of 1st Youth Test Against England U19 Team

ఇంగ్లండ్‌ అండర్‌ 19 జట్టుతో జరుగుతున్న తొలి యూత్‌ టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 540  పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (102) సూపర్‌ సెంచరీతో కదంతొక్కగా.. విహాన్‌ మల్హోత్రా (67), అభిగ్యాన్‌ కుందు (90), రాహుల్‌ కుమార్‌ (85), ఆర్‌ఎస్‌ అంబరీష్‌ (70) అర్ద సెంచరీలతో రాణించారు. 

కుర్ర చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఈ ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. వైభవ్‌ 13 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 14 పరుగులు చేసి అలెక్స్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో రాల్ఫీ ఆల్బర్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 

మిగతా బ్యాటర్లలో చవ్డా 11, మొహమ్మద్‌ ఎనాన్‌ 23, హెనిల్‌ పటేల్‌ 38, దీపేశ్‌ దేవేంద్రన్‌ 4, అన్మోల్‌జీత్‌ సింగ్‌ 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో గ్రీన్‌, ఆల్బర్ట్‌ తలో 3 వికెట్లు తీయగా.. జాక్‌ హోమ్‌, ఆర్చీ వాన్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి మ్యాచ్‌ మినహా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో చెలరేగిపోయాడు.

తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్‌.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు.

ఐదో  వన్డేలో 42 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో, 78.57 స్ట్రయిక్‌రేట్‌తో 33 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో వైభవ్‌ ఇంత తక్కువ స్ట్రయిక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయడం ఇదే మొదటిసారి. వైభవ్‌ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో 130కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. వన్డే సిరీస్‌లో వైభవ్‌ విధ్వంసం ధాటికి ఇంగ్లండ్‌ యువ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వైభవ్‌ ప్రతి మ్యాచ్‌ల కనీసం రెండైనా సిక్సర్లు కొట్టాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement