
ఈ ఏడాది ఆగస్టులో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్‌బాల్ సిరీస్‌లపై అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ సిరీస్‌లకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ అమీనుల్ ఇస్లాం కీలక అప్‌డేట్ ఇచ్చారు. బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ(BCCI) ఇంకా ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తుందని అమీనుల్ ఇస్లాం తెలిపాడు.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టులో భారత జట్టు మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం బంగ్లాలో పర్యాటించాల్సి ఉంది. ఆగస్టు 17 నుంచి టీమిండియా టూర్ ప్రారంభమవ్వాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌లు జరగడం అసంభవం అన్పిస్తోంది.
అయితే బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ మాత్రం ఈ సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టులో వీలుకాకపోయినా, తర్వాతైనా భారత జట్టు తమ దేశానికి రావాలని అతడు ఆశిస్తున్నాడు. "ఈ పర్యటనకు సంబంధించి మేము బీసీసీఐతో నిరంతరం చర్చలు జరుపుతున్నాము. వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సిరీస్‌లను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాము.
ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే తర్వాతైనా భారత్‌కు ఆతిథ్యమిస్తామన్న నమ్మకం మాకు ఉంది. భారత్ ఇంకా అధికారికంగా టూర్‌ను వాయిదా వేయలేదు. భారత జట్టు బంగ్లా పర్యటన అనేది ప్రభుత్వం నుండి అనుమతి లభించడంపై ఆధారపడి ఉందని" బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో అమీనుల్ పేర్కొన్నారు.
కాగా భారత జట్టు వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే, బీసీబీ ఐపీఎల్-2026 వేచి ఉండాల్సిందే. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరిలో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయింది. పొట్టి ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ జరగనుంది. కాబట్టి వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే భారత జట్టుకు కాస్త సమయం లభిస్తోంది. టీమిండియా చివరగా 2022లో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాలో పర్యటించింది.
చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్! అతడికి పిలుపు?