
ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ది టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. మాజీ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ(Moeen Ali) కోచింగ్ కన్సల్టెంట్‌గా ఇంగ్లండ్ జట్టులో చేరాడు.
హెడ్ కోచ్ బ్రాండెన్ మెకల్లమ్‌తో కలిసి మోయిన్ అలీ తన సేవలను అందించనున్నట్లు టెలిగ్రాఫ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విల్ మాక్‌ఫెర్సన్ వెల్లడించారు. సోమవారం అలీ నేతృత్వంలోనే ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ చేసినట్లు ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశమున్నందన మోయిన్‌ను తమ కోచింగ్ సెటప్‌లోకి ఇంగ్లండ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆఫ్ స్పిన్నర్ అయిన అలీ.. తొలి టెస్టులో విఫలమైన యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు గైడ్ చేసే అవకాశముంది. అంతేకాకుండా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇంగ్లండ్ బ్యాటర్లకు అలీ చిట్కాలు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టులో ఆడడంపై ఇంకా సందిగ్థం కొనసాగుతోంది. మ్యాచ్‌కు ముందే అతని అందుబాటుపై నిర్ణయం ఉంటుందని భారత అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే చెప్పుకొచ్చాడు.
ఒకవేళ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. మూడో టెస్టు నుంచి అతడు అవకాశముంది.
టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్
చదవండి: బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్