
ఇంగ్లండ్ పర్యటనలో మొదటి నుంచి భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడే మూడు టెస్టుల గురించే చర్చ జరుగుతూ వచ్చింది. ఇప్పుడూ అదే కొనసాగుతోంది. ఇప్పటికే బుమ్రా తొలి టెస్టు ఆడాడు. జట్టు ఇంకా ఆడాల్సిన నాలుగు టెస్టుల్లో బుమ్రా ఆడేవి రెండే మ్యాచ్‌లు. ఆ రెండు ఏవనే దానిపై చర్చంతా సాగుతోంది. తాజాగా దీనిపై భారత అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు.
కానీ మ్యాచ్‌కు ముందే అతని అందుబాటుపై నిర్ణయం ఉంటుందని చెప్పాడు. ఎప్పటిలాగే అతను ట్రెయినింగ్ సెషన్‌లో పాల్గొంటున్నాడని, విశ్రాంతి తీసుకోవడం లేదన్నాడు. సోమవారం కూడా సహచరులతో కలిసి ప్రాక్టీస్‌లో చెమటోడ్చినట్లు చెప్పాడు. "తదుపరి మ్యాచ్‌కూ బుమ్రా అందుబాటులో ఉండే అవకాశముంది.
అతను ఆడేది మూడు టెస్టులే అయినప్పటికీ గడిచిన తొలి టెస్టుకు, జరగబోయే రెండో టెస్టుకు మధ్య 8 రోజుల విశ్రాంతి లభించింది. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో పనిభారాన్ని పరిశీలించాకే అతనిపై నిర్ణయం తీసుకుంటాం" అని అసిస్టెంట్ కోచ్ అన్నాడు. తొలి టెస్టులో ఆతిథ్య జట్టుకు దీటుగానే బదులిచ్చామని, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వికెట్లు తీయడంలో వెనుకబడినప్పటికీ గెలిచేదశలో కనిపించామని చెప్పాడు.
ఇద్దరు స్పిన్నర్ల కూర్పుపై కూడా జట్టు మేనేజ్‌మెంట్ విశ్లేస్తోంది. బ్యాటింగ్‌ను బలోపేతం చేయాలనుకుంటే సీనియర్ స్పిన్నర్ జడేజాకు జతగా వాషింగ్టన్ సుందర్‌ను బరిలోకి దించే అంశాన్ని గట్టిగానే పరిశీలిస్తోంది. అయితే పిచ్ పరిస్థితులని బట్టే తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు డస్కటే చెప్పాడు.
తొలి మ్యాచ్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన శార్దుల్ పెద్దగా రాణించలేకపోయాడు. అయితే ఒకే టెస్టుతో అతని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయబోమని, అయితే బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అవసరమనుకుంటేనే అతన్ని మార్చే అంశాల్ని పరిశీలిస్తామన్నాడు. ఇదే జరిగితే నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టుకు ఖాయమవుతాడు.
లీడ్స్‌లో సులువైన క్యాచ్‌ల్ని నేలపాలు చేయడంతో ఫీల్డింగ్‌పై ప్రధానంగా దృష్టిసారించిన జట్టు స్లిప్స్, గల్లీ వద్ద కట్టుదిట్టం చేయనుంది. జైస్వాల్‌ను గల్లీ నుంచి తప్పించడం ఖాయమైంది. నాలుగో స్లిప్, గల్లీ ప్లేస్‌మెంట్‌లను కరుణ్ నాయర్, రాహుల్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌లతో భర్తీ చేయనున్నట్లు డస్కటే తెలిపాడు. ఈ మేరకు ఆ ముగ్గురితో పాటు సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డిలతో ఫీల్డింగ్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు.
చదవండి: నిరాశపరిచిన ఆయుశ్ మాత్రే.. మరోసారి విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ