టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌ | India A but no IPL matches: How Gurnoor Brar soared up the ranks to impress in debut ODI series | Sakshi
Sakshi News home page

Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌

Jun 18 2026 4:57 PM | Updated on Jun 18 2026 5:51 PM

India A but no IPL matches: How Gurnoor Brar soared up the ranks to impress in debut ODI series

ప్రస్తుత తరం క్రికెట్‌లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్‌లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్‌లో రాణించి టీమిండియాలోకి వచ్చినవారే. 

అయితే ఇప్పుడు ఒక 26 ఏళ్ల యువకుడు ఐపీఎల్‌తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్‌ లాంటి బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్.

అరంగేట్రంలో అదుర్స్‌
పంజాబ్‌కు చెందిన  గుర్నూర్ బ్రార్.. ఇటీవ‌ల అఫ్గానిస్తాన్‌తో ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రిగిన భార‌త త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేశాడు. త‌న తొలి మ్యాచ్‌లోనే 3 వికెట్లు ప‌డ‌గొట్టి అంద‌రి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన రెండో వన్డేలనూ అతడు సత్తాచాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు.

దీంతో తన కెరీర్‌లోని మొదటి రెండు వన్డేల తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. కాగా ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధార‌ప‌డుతోంది. అత‌డికి స‌పోర్ట్‌గా మ‌హ్మ‌ద్ సిరాజ్‌, అర్ష్‌దీప్ సింగ్ వంటి పేస‌ర్లు ఉన్నారు. వీరు ముగ్గురు త‌ప్ప ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో నిల‌క‌డ‌గా రాణించే మ‌రొక ఫాస్ట్ బౌల‌ర్ లేడు.

ఇప్పుడు గుర్నూర్ ఎంట్రీతో భార‌త్ పేస్ బౌలింగ్ క‌ష్టాలు తీరిన‌ట్లే అనే చెప్పాలి. ఈ పంబాబ్ స్పీడ్ స్టార్‌కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అత‌డికి ఉంది.  6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న బ్రార్.. ఫ్లాట్ పిచ్‌పైనైనా ఊహించని ‘స్టీప్ బౌన్స్’ రాబట్టగలడు. 

దీంతో భార‌త క్రికెట్‌కు మ‌రో బుమ్రా దొరికాడ‌ని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బుమ్రా కూడా త‌న కెరీర్‌లో తొలి రెండో వన్డేల్లో 6 వికెట్లే ప‌డ‌గొట్టాడు. ఇప్పుడు గుర్నూర్ కూడా యాదృచ్ఛికంగా 6 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌లో నో ఛాన్స్‌!
గుర్నార్ బ్రార్‌.. 2023లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున‌ ఐపీఎల్ అరంగేట్రం చేసిన‌ప్ప‌టికి ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ త‌ర్వాత ఐపీఎల్‌-2024 నుంచి గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో స‌భ్యుడిగా గుర్నూర్ ఉన్నాడు.  కానీ గ‌త మూడు సీజ‌న్ల‌లోనూ కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.

కానీ మైదానంలో దిగకపోయినా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా వంటి దిగ్గ‌జ పేస‌ర్ పర్యవేక్షణలో అత‌డు రాటు దేలాడు. మహ్మద్ సిరాజ్‌, ఇషాంత్ శర్మ వంటి అంతర్జాతీయ అనుజ్ఞులైన బౌలర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, నెట్స్‌లో శ్రమించడం ద్వారా గుర్నూర్ ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ విష‌యాన్ని అత‌డే స్వ‌యంగా చాలా సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చాడు.

అదే ట‌ర్నింగ్ పాయింట్‌?
కాగా గుర్నార్ బ్రార్ దేశ‌వాళీ క్రికెట్‌లో కూడా నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు.  పంజాబ్ త‌ర‌పున కేవలం 18 ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే గ‌తేడాది స్వ‌దేశంలో ఆస్ట్రేలియా-ఎతో జ‌రిగిన వ‌న్డే సిరీస్ అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ చెప్పాలి. ఈ సిరీస్‌లో బ్రార్ దుమ్ములేపాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 

ఆ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి సీనియర్ల కంటే అత‌డే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ త‌ర్వాత అత‌డికి భారత జట్టులో నెట్‌ బౌలర్‌గా అవ‌కాశం ద‌క్కింది. ఇప్పుడు అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌కు బుమ్రా, సిరాజ్ వంటి ప్ర‌ధాన పేస‌ర్లకు విశ్రాంతి ఇవ్వ‌డంతో గుర్నూర్‌కు ప్ర‌ధాన జ‌ట్టులో చోటు క‌ల్పించారు. త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని రెండు చేతులా ఈ పంజాబ్ పేస‌ర్ అందిపుచ్చుకున్నాడు.

 కాగా 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ గుర్నార్‌ను భార‌త జ‌ట్టుకు ఎంపిక చేశారు.ఎందుకంటే అక్కడి పిచ్‌లపై పేస్, బౌన్స్ ఉన్న బౌలర్లు చాలా కీలకం కానున్నారు.
చదవండి: టీమిండియాకు భారీ షాక్‌.. స్ట్రెచర్‌పై బయటకు వెళ్లిన స్టార్‌ ప్లేయర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement