మూడు శతకాల మోత | India lead by 286 runs in the first Test | Sakshi
Sakshi News home page

మూడు శతకాల మోత

Oct 4 2025 3:09 AM | Updated on Oct 4 2025 3:09 AM

India lead by 286 runs in the first Test

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 448/5

రాహుల్, జురేల్, జడేజా సెంచరీలు

ఇప్పటికే 286 పరుగుల ఆధిక్యం

162 పరుగులకే కుప్పకూలిన విండీస్‌

వెస్టిండీస్‌తో విజయ దశమి రోజు మొదలైన తొలి టెస్టులో రెండో రోజే టీమిండియా శాసించే స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్‌ గడ్డపై భారత్‌ను గట్టెక్కించిన హైదరాబాద్‌ స్పీడ్‌స్టర్‌ సిరాజ్‌... కరీబియన్‌ జట్టును తొలి రోజే ఆలౌట్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో రోజు ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ లోకేశ్‌ రాహుల్‌తో పాటు ధ్రువ్‌ జురేల్, రవీంద్ర జడేజా శతక్కొట్టడంతో భారత్‌ ఇప్పటికే భారీ ఆధిక్యం అందుకుంది. ఈ రెండు రోజుల్లోనే విండీస్‌ జట్టు అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో కుదేలైంది.

అహ్మదాబాద్‌: భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్‌ జట్టుకు టెస్టు సిరీస్‌ మొదలైన రెండు రోజుల్లోనే టీమిండియా తడాఖా చూపెట్టింది. స్టార్‌ పేసర్లు సిరాజ్‌ (4/40), బుమ్రా (3/42) కరీబియన్‌ బ్యాటర్ల పని పట్టారు. కుల్దీప్, సుందర్‌ల స్పిన్‌ కూడా వారి పేస్‌కు తోడవడంతో కనీసం వన్డే ఓవర్ల కోటానైనా పర్యాటక జట్టు ఆడలేకపోయింది. తర్వాత భారత బ్యాటర్లు లోకేశ్‌ రాహుల్, ధ్రువ్‌ జురేల్, జడేజాలు మూకుమ్మడిగా విండీస్‌ బౌలర్లపై చెలరేగారు. 

భారత్‌ ఈ రకమైన ఆల్‌రౌండ్‌ జోరు చూస్తుంటే... మూడు రోజుల్లోనే ముగిసేలా ఉంది. ముందుగా వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. జస్టిన్‌ గ్రీవ్స్‌ (48 బంతుల్లో 32; 4 ఫోర్లు) చేసిన 30 పైచిలుకు స్కోరే ఇన్నింగ్స్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు! కుల్దీప్‌ 2, సుందర్‌ ఒక వికెట్‌ తీశారు. తర్వాత భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. 

ధ్రువ్‌ జురేల్‌ (210 బంతుల్లో 125; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (197 బంతుల్లో 100; 12 ఫోర్లు), రవీంద్ర జడేజా (176 బంతుల్లో 104 బ్యాటింగ్‌; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతక్కొట్టారు. రోస్టన్‌ చేజ్‌కు 2 వికెట్లు దక్కాయి. 

సిరాజ్‌ కూల్చేశాడు 
మొదటి రోజు గురువారం టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌కు శ్రీకారం చుట్టింది. అయితే నాలుగో ఓవర్‌ నుంచే సిరాజ్‌ ఓ వైపు, బుమ్రా రెండో వైపు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కరీబియన్‌ బ్యాటర్లను క్రీజులోనే నిలువనీయలేదు. దీంతో తేజ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ (0), జాన్‌ క్యాంప్‌బెల్‌ (8), అలిక్‌ అతనేజ్‌ (12), బ్రాండన్‌ కింగ్‌ (13)... ఇలా టాప్‌–4 బ్యాటర్లను కోల్పోయిన విండీస్‌ 42/4 స్కోరు వద్దే కష్టాల్లో చిక్కుకుంది. 

కాసేపు కెప్టెన్ చేజ్‌ (24; 4 ఫోర్లు), షై హోఫ్‌ (26; 3 ఫోర్లు) వికెట్ల పతనాన్ని ఆపగలిగారే కానీ... కుల్దీప్‌ దిగగానే హోప్‌ను అవుట్‌ చేయడంతో వందలోపే సగం (ఐదు) వికెట్లను కోల్పోయింది. వందయ్యాక చేజ్‌ను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. గ్రీవ్స్‌ చేసిన ఆమాత్రం స్కోరుతో విండీస్‌ 150 పైచిలుకు స్కోరును కష్టంగా చేయగలిగింది. 

రాహుల్‌ శతకం 
ఓపెనర్లు జైస్వాల్‌ (36; 7 ఫోర్లు), రాహుల్‌ చక్కని ఆరంభాన్నిచ్చారు. కానీ తక్కువ వ్యవధిలోనే జైస్వాల్, సాయి సుదర్శన్‌ (7) అవుటయ్యారు.  కెప్టెన్ గిల్‌ అండతో రాహుల్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా తొలి రోజును 121/2 స్కోరు వద్ద ముగించారు. శుక్రవారం 57 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన రాహుల్‌ సెంచరీ దిశగా పయనించగా, అర్ధ శతకం పూర్తయిన వెంటనే గిల్‌ నిష్క్రమించాడు. 

జురేల్‌ క్రీజులోకి రాగా లంచ్‌ బ్రేక్‌కు ముందే భారత్‌ స్కోరు 200 దాటింది. దీంతో పాటే రాహుల్‌ టెస్టుల్లో 11వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంటనే తన కుమార్తె ఇవారా కోసం అన్నట్లుగా ఈల వేస్తూ వేడుక చేసుకున్నాడు. మొత్తానికి సొంతగడ్డపై దాదాపు తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెర దించుతూ సెంచరీ సాధించాడు. 2016 డిసెంబర్లో సెంచరీ అనంతరం మళ్లీ ఇప్పుడే భారత గడ్డపై రాహుల్‌ శతకం సాధించాడు. 

కదంతొక్కిన జురేల్, జడేజా 
రాహుల్‌ అవుటయ్యాక జురేల్‌కు జడేజా జత కలిశాడు. వీళ్లిద్దరు క్రీజులో పాతుకొనిపోవడంతో భారత్‌ స్కోరుతో పాటే విండీస్‌ కష్టాలు అంతకంతకు పెరిగిపోయాయి. రెండో సెషన్లోనే ఇద్దరు అర్ధ సెంచరీలు సాధించగా జట్టు స్కోరు 300లకు చేరింది. 162 పరుగులకే ప్రత్యర్థి జట్టు అన్ని వికెట్లను కోల్పోతే... జురేల్, జడేజా ఇద్దరే ఐదో వికెట్‌కు 206 పరుగులు జోడించడం భారత్‌ భారీస్కోరుకు బాటవేసింది. 

ఆరో టెస్టులో జురేల్‌ తొలి అంతర్జాతీయ సెంచరీ ముచ్చట తీర్చుకున్నాడు. అతను అవుటయ్యాక జడేజా శతకం పూర్తయ్యింది. భారత్‌ ఎదుర్కొన్న 128 ఓవర్లలో 3.5 రన్‌రేట్‌తో పరుగులు సాధించింది. బ్యాటర్లంతా కలిసి 45 బౌండరీలు, 8 సిక్సర్లు బాదారు. ఆట నిలిచే సమయానికి జడేజాతో సుందర్‌ (9 బ్యాటింగ్‌) అజేయంగా నిలిచాడు.

‘అపోలో’ ఆట మొదలు
విండీస్‌తో తొలి టెస్టులో భారత జట్టు కొత్త స్పాన్సర్‌ ‘అపోలో టైర్స్‌’ లోగో ఉన్న జెర్సీతో బరిలోకి దిగింది. ప్రధాన స్పాన్సరర్‌గా బీసీసీఐకి మూడేళ్ల కాలానికి అపోలో రూ. 579 కోట్లతో ఒప్పందం చేసుకుంది.  

స్కోరు వివరాలు 
వెస్టిండీస్‌ తొలిఇన్నింగ్స్‌: క్యాంప్‌బెల్‌ (సి) జురేల్‌ (బి) బుమ్రా 8; తేజ్‌ నారాయణ్‌ (సి) జురేల్‌ (బి) సిరాజ్‌ 0; అతనేజ్‌ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 12; కింగ్‌ (బి) సిరాజ్‌ 13; చేజ్‌ (సి) జురేల్‌ (బి) సిరాజ్‌ 24; షై హోప్‌ (బి) కుల్దీప్‌ 26; గ్రీవెస్‌ (బి) బుమ్రా 32; పియర్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్‌ 11; వేరికన్‌ (సి) జురేల్‌ (బి) కుల్దీప్‌ 8; జాన్‌ లేన్‌ (బి) బుమ్రా 1; సీలెస్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (44.1 ఓవర్లలో ఆలౌట్‌) 162. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–39, 4–42, 5–90, 6–105, 7–144, 8–150, 9–153, 10–162. 
బౌలింగ్‌: బుమ్రా 14–3–42–3, సిరాజ్‌ 14–3–40–4, నితీశ్‌ 4–1–16–0, రవీంద్ర జడేజా 3–0–15–0, కుల్దీప్‌ యాదవ్‌ 6.1–0–25–2, సుందర్‌ 3–0–9–1. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) షై హోప్‌ (బి) సీలెస్‌ 36; రాహుల్‌ (సి) గ్రీవెస్‌ (బి) వేరికన్‌ 100; సాయి సుదర్శన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) చేజ్‌ 7; గిల్‌ (సి) గ్రీవెస్‌ (బి) చేజ్‌ 50; ధ్రువ్‌ జురేల్‌ (సి) షై హోప్‌ (బి) పియర్‌ 125; జడేజా బ్యాటింగ్‌ 104; సుందర్‌ బ్యాటింగ్‌ 9; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (128 ఓవర్లలో 5 వికెట్లకు) 448. వికెట్ల పతనం: 1–68, 2–90, 3–188, 4–218, 5–424. బౌలింగ్‌: సీలెస్‌ 19–2–53–1, జాన్‌ లేన్‌ 15–0–38–0, జస్టిన్‌ గ్రీవెస్‌ 12–4–59–0, జొమెల్‌ వేరికన్‌ 29–5–102–1, పియర్‌ 29–1–91–1, రోస్టన్‌ చేజ్‌ 24–3–90–2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement