నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ
మహిళల టి20 ప్రపంచకప్
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
మాంచెస్టర్: పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై ఘన విజయాలతో టి20 ప్రపంచకప్‌ను గొప్పగా ప్రారంభించిన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమితో ఒక్కసారిగా తమ పరిస్థితిని కాస్త సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు తర్వాతి పోరులో బలహీన జట్టు బంగ్లాదేశ్‌పై చెలరేగి గెలిస్తే జట్టు ముందంజ వేసే అవకాశాలు మెరుగవుతాయి. నేడు జరిగే ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు మంచి రన్‌రేట్ కూడా హర్మన్‌ప్రీత్ బృందానికి అవసరం. ఓవరాల్‌గా బంగ్లాదేశ్‌పై 20–3 రికార్డుతో భారత్‌దే పైచేయి అయినా... ఉదాసీనత కనబరిస్తే బంగ్లాదేశ్ కూడా షాక్ ఇవ్వగలదు.
గత పోరులో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ జోరు మీదుంది. భారత ఓపెనర్లు షఫాలీ, స్మృతి 150కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించి శుభారంభం ఇస్తున్నారు. అయితే జెమీమా, హర్మన్, యస్తిక తడబాటుతో భారీ స్కోరు సాధించడం జట్టుకు కష్టంగా మారుతోంది. 3 మ్యాచ్‌లలో కలిపి జెమీమా 32 పరుగులే చేసింది. లోయర్ ఆర్డర్‌లో రిచా ఘోష్ దూకుడుగా ఆడటం సానుకూలాంశం. గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన లెగ్‌స్పిన్నర్ ప్రేమ రావత్ విఫలం కావడంతో ఆమె స్థానంలో రాధ యాదవ్‌కు అవకాశం దక్కవచ్చు.
బంగ్లాను పదునైన పేస్‌తో ఇబ్బంది పెట్టే వ్యూహంతో క్రాంతి గౌడ్‌ను తుది జట్టులో చేర్చాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఎడంచేతి వాటం స్పిన్నర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి నిలకడగా రాణిస్తోంది. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో ఓపెనర్ ఫిర్దోస్, కెపె్టన్ నిగార్ సుల్తానాలపై ఆధారపడుతుండగా... బౌలింగ్‌లో మారుఫా అక్తర్, నాహిదా అక్తర్ కీలకం కానున్నారు.
గ్రూప్ ‘1’లో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచి ఆ్రస్టేలియా సెమీఫైనల్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకోగా, రెండో స్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికా మధ్య పోటీ ఉంది. నేటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో సఫారీ టీమ్ ఆడాల్సి ఉండగా... భారత్ చివరి పోరులో ఆ్రస్టేలియాను ఎదుర్కొంటుంది. కాబట్టి రన్‌రేట్‌లో దక్షిణాఫ్రికాతో పోటీ పడాలంటే హర్మన్ బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది.


