
కొలంబో: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ జట్టును భారత జట్టు చితక్కొట్టగా... మరోవైపు ఫుట్‌బాల్‌లోనూ పాకిస్తాన్ జట్టుపై భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్‌తో సోమవార జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున దలాల్‌మువాన్ గాంగ్టే (31వ నిమిషంలో), గున్లేబా వాంగ్‌ఖెరాక్‌పమ్ (64వ నిమిషంలో), రహాన్ అహ్మద్ (74వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
పాకిస్తాన్ జట్టుకు హంజా యాసిర్ (71వ నిమిషంలో), మొహమ్మద్ అబ్దుల్లా (43వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తొమ్మిది పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఆరు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్రూప్ ‘బి’ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి బంగ్లాదేశ్, నేపాల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఈనెల 25న జరిగే సెమీఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్; నేపాల్‌తో భారత్ తలపడతాయి.