
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో (India A vs Australia A) భారత-ఏ బౌలర్లు చెలరేగిపోయారు. అంతకుముందు బ్యాటింగ్‌లో తడబడినా, బౌలింగ్‌లో మాత్రం చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే ఆలౌటై, ప్రత్యర్ధికి 226 పరుగుల భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు చుక్కలు చూపించారు.
రెండో రోజు చివర్లో బౌలింగ్‌కు దిగి కేవలం 7.5 ఓవర్లలో ముగ్గురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. 3 పరుగుల వద్దనే ఓపెనర్ల పని పట్టి, మరో 13 పరుగుల తర్వాత నాలుగో నంబర్ ఆటగాడిని ఔట్ చేశారు. ఫామ్‌లో ఉన్న సామ్ కొన్‌స్టాస్‌ను (3) గుర్నూర్ బ్రార్.. మరో ఓపెనర్ క్యాంప్‌బెల్ కెల్లావేను (0) సిరాజ్ (Mohammed Siraj).. ఒలివర్ పీక్‌ను (1) మానవ్ సుతార్ ఔట్ చేశారు.
ఫలితంగా ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆ జట్టు లీడ్ 242 పరుగులుగా ఉంది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీని (11) క్రీజ్‌లో ఉన్నాడు.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. ఆసీస్ సాధించిన 420 పరుగుల భారీ స్కోర్‌కు బదులిచ్చే క్రమంలో 194 పరుగులకే ఆలౌటైంది. సాయి సుదర్శన్ (Sai Sudharsan) (75) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. ఎన్ జగదీసన్ (38), ఆయుశ్ బదోని (21), ప్రసిద్ద్ కృష్ణ (16 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్(KL Rahul) (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో థార్న్‌టన్ 4 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. మర్ఫీ 2, సదర్‌ల్యాండ్, రొచ్చిక్కియోలీ, కన్నోల్లీ తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మెక్‌స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88), మర్ఫీ (76) అర్ద సెంచరీలతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. గుర్నూర్ బ్రార్ 3, సిరాజ్, ప్రసిద్ద్ తలో వికెట్ తీశారు.
కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇదివరకే తొలి టెస్ట్ మ్యాచ్ పూర్తి కాగా.. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
చదవండి: IND vs AUS: దారుణంగా విఫలమైన భారత జట్టు.. ఆసీస్‌కు భారీ ఆధిక్యం