
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టు (IND A vs AUS A)లో భారత జట్టు దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 194 పరుగులే చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్‌కు మొదటి ఇన్నింగ్స్ 226 పరుగుల ఆధిక్యం లభించింది.
లక్నోలోని ఏకనా స్టేడియంలో ఆసీస్‌తో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్-‘ఎ’ జట్టు.. తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఇదే వేదికపై మంగళవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
తొలిరోజు 350
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్... లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (5/93) ఐదు వికెట్లతో విజృంభించడంతో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి 84 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. జాక్ ఎడ్వర్డ్స్ (78 బంతుల్లో 88; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (162 బంతుల్లో 74; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు.
ఎడ్వర్డ్స్ ధనాధన్ షాట్‌లతో రెచ్చిపోగా... మెక్‌స్వీనీ సంయమనం పాటిస్తూ అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్ (91 బంతుల్లో 49, 7 ఫోర్లు), వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ (33 బంతుల్లో 39; 5 ఫోర్లు) కూడా రాణించారు.
420 పరుగులకు ఆలౌట్
ఒలీవర్ పీక్ (29 6 ఫోర్లు), టాడ్ మార్ఫీ (29 బ్యాటింగ్; 5 ఫోర్లు) విలువైన పరుగులు జోడించారు. ఈ క్రమంలో 350/9తో ఓవర్ నైట్ స్కోరుతో బుధవారం ఆట మొదలుపెట్టిన ఆసీస్.. 420 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్లు
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్-‘ఎ’ 194 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (11) విఫలం కాగా.. నారాయణ్ జగదీశన్ 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, దేవ్‌దత్ పడిక్కల్ (1), కెప్టెన్ ధ్రువ్ జురెల్ (1), నితీశ్ కుమార్ రెడ్డి (1) దారుణంగా ఫెయిల్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది.
ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 140 బంతులు ఓపికగా ఆడి 75 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. కానీ టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగాడు. మిగతా వారిలో ఆయుశ్ బదోని (21) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. ప్రసిద్ కృష్ణ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
శ్రేయస్‌స్థానంలో సారథిగా జురెల్
ఆసీస్-‘ఎ’ బౌలర్లలో హెన్రీ థార్న్‌టన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. టామ్ మర్ఫీ రెండు, క్యారీ రొసిచిల్లి, కూపర్ కన్నోలి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’జట్టు పలు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... అందులో భారత ‘ఎ’జట్టు సారథిగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. దీంతో అతడి స్థానంలో ధ్రువ్ జురేల్ సారథ్య బాధ్యతలు అందుకోగా... జగదీశన్ వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు.
సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుతో చేరాడు. ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్... కాస్త విశ్రాంతి తర్వాత తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ టూర్‌లో గాయపడిన ఆంధ్ర పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి... సాధికారికంగా బౌలింగ్ చేశాడు.
తొలి రోజు 8 ఓవర్లు వేసిన అతడు 16 పరుగులిచ్చి వికెట్ పడగొట్టలేకపోగా... బుధవారం నాటి ఆటలో బౌలింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఇక సిరాజ్ 73 పరుగులు ఇచ్చి ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ తీయగా... గుర్‌నూర్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టాడు.
భారత్-‘ఎ’ వర్సెస్ ఆసీస్-‘ఎ’ స్కోర్లు
👉ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 420
👉భారత్ తొలి ఇన్నింగ్స్: 194
👉ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 226 పరుగుల ఆధిక్యం