తిలక్‌ తడాఖా.. చెపాక్‌ టీ20లో భారత్‌ విజయం | India beat England by two wickets: Second cricket T20I | Sakshi
Sakshi News home page

తిలక్‌ తడాఖా.. చెపాక్‌ టీ20లో భారత్‌ విజయం

Published Sun, Jan 26 2025 1:13 AM | Last Updated on Sun, Jan 26 2025 7:50 AM

India beat England by two wickets: Second cricket T20I

భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించిన హైదరాబాద్‌ బ్యాటర్‌

రెండో టి20లో ఇంగ్లండ్‌పై 2 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు

28న రాజ్‌కోట్‌లో మూడో టి20

భారత్‌ ముందున్న లక్ష్యం 166. స్కోరేమో 15 ఓవర్లలో 126/7. అంటే ఈ పాటికే అర్థమై ఉంటుంది. మిగిలిందల్లా టెయిలెండర్లే అని! గెలుపు కష్టమని!! కానీ వారితో పాటు ఒకడు మిగిలాడు. అతడే తెలుగు తేజం నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ. 30 బంతుల్లో 40 పరుగులు... ఇది గెలుపు సమీకరణం. సరిజోడు లేకపోయినా, బ్యాటింగ్‌ చేయగలిగే ఆటగాడు కరువైనా... వెన్నుచూపలేదు. ఇంగ్లండ్‌ బౌలింగ్‌కు తమ సహచరుల్లా తలొంచలేదు. ఆర్చర్‌ 16వ ఓవర్లో 0, 6, 6, 1, 4, 2లతో 19 పరుగులొచ్చాయి. ఇందులో 2 సిక్స్‌లు, 1 పరుగు తిలకే చేశాడు.

ఇక 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఇది భారత్‌ను ఊరించింది. కానీ ఆదిల్‌ రషీద్‌ 17వ ఓవర్లో 1 పరుగిచ్చి అర్ష్దీప్‌ను అవుట్‌ చేయడంతో మళ్లీ టెన్షన్‌... టెన్షన్‌... అప్పుడు రవి బిష్ణోయ్‌ (5 బంతుల్లో 9 నాటౌట్‌; 2 ఫోర్లు) ఆపద్భాంధవుడిలా వచ్చాడు. అతనిది సింగిల్‌ డిజిట్‌ స్కోరే కావొచ్చు. కానీ తిలక్‌తో అమూల్యమైన, అబేధ్యమైన విజయానికి ఆ పరుగులు, ఆ భాగస్వామ్యమే (తొమ్మిదో వికెట్‌కు 20 పరుగులు) టీమిండియాను గెలిపించింది. సిరీస్‌లో 2–0తో పైచేయి సాధించేలా చేసింది.  

 చెన్నై: ఓపెనర్ల దూకుడు లేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ జోరు కనిపించలేదు. హార్దిక్‌ పాండ్యా అనుభవం కలిసిరాలేదు. కానీ... ఇన్ని ప్రతికూలతల మధ్య భారత్‌ రెండో టి20లో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. కారణం ఒకేఒక్కడు తిలక్‌ వర్మ. అసలు ఆశలే లేని చోట... స్పెషలిస్టు బ్యాటర్లే కరువైన వేళ... పరుగుల వేటలో గెలుపుబాట పరిచాడు. 20వ ఓవర్‌ రెండో బంతికి బౌండరీతో విన్నింగ్‌షాట్‌ కొట్టేదాకా క్రీజులో కడదాకా నిలిచి భారత్‌ను గట్టెక్కించాడు. ఆఖరిదాకా విజయం కోసం పట్టుబిగించిన ఇంగ్లండ్‌ చివరకు 2 వికెట్ల తేడాతో భారత్‌ చేతిలో పరాజయం పాలైంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 

కెపె్టన్‌ జోస్‌ బట్లర్‌ (30 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బ్రైడన్‌ కార్స్‌ (17 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. అక్షర్, వరుణ్‌ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌ 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తిలక్‌ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు.  

మెరిపించిన బట్లర్, కార్స్‌ 
ఆరంభంలోనే ఓపెనింగ్‌ జోడీ సాల్ట్‌ (4)ను అర్ష్దీప్, డకెట్‌ (3)ను సుందర్‌ పెవిలియన్‌ చేర్చారు. సొంత ప్రేక్షకుల మధ్య తొలి ఓవర్‌ (ఇన్నింగ్స్‌ 4వ) వేసేందుకు దిగిన సుందర్‌ తొలి బంతికే డకెట్‌ను బోల్తాకొట్టించాడు. హ్యారీ బ్రూక్‌ (13), లివింగ్‌స్టోన్‌ (13)లను వరుణ్, అక్షర్‌ కుదురుకోనివ్వలేదు. చెప్పుకోదగిన భాగస్వామ్యం లేకపోయినా... ధాటైన ఇన్నింగ్స్‌ ఏ ఒక్కరు ఆడలేకపోయినా... ఇంగ్లండ్‌ ఆఖరుకొచ్చే సరికి పుంజుకుంది. కెపె్టన్‌ బట్లర్‌ మెరుపులతో స్కోరు మోస్తరుగా సాగిపోగా... అరంగేట్రం హీరో జేమీ స్మిత్‌ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కార్స్‌ల వేగంతో స్కోరు వేగం పెరిగింది. అర్ష్దీప్, పాండ్యా, సుందర్, అభిషేక్‌లకు తలా ఒక వికెట్‌ దక్కింది. 

తిలక్‌... అంతా తానై... 
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లాగే మనకూ మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు అభిషేక్‌ (12)కు మార్క్‌ వుడ్, సామ్సన్‌ (5)కు ఆర్చర్‌ చెక్‌ పెట్టారు. తిలక్‌ వర్మ అడపాదడపా మెరుపులతో భారత్‌ స్కోరు 50 దాటింది. కానీ ఈ దశలో కెపె్టన్‌ సూర్యకుమార్‌ (12), ధ్రువ్‌ జురేల్‌ (4), హార్దిక్‌ పాండ్యా (7)లు స్వల్పవ్యవధిలో అదికూడా 10 ఓవర్లలోపే అవుటవడం భారత్‌ ఇన్నింగ్స్‌కు పెద్దకుదుపు... 9.1 ఓవర్లు 78/5 స్కోరు! గెలుపు చాలా దూరంలో ఉంటే మిగిలిన స్పెషలిస్టు బ్యాటర్‌ తిలక్‌ వర్మ ఒక్కడే! సుందర్, అక్షర్‌ పటేల్‌ (2) బ్యాటింగ్‌ చేయగలరు కానీ గెలిపించేదాకా నిలుస్తారా అన్న సందేహాలు భారత శిబిరాన్ని, స్టేడియంలోని ప్రేక్షకుల్ని కలవరపెట్టాయి. ఊహించినట్లే వారిద్దరు కలవరపెట్టే నిష్క్రమించారు. ఈ దశలో తిలక్‌వర్మ గెలిచేదాకా బాధ్యతను భుజానవేసుకొని విజయమాల భారత జట్టు మెడలో వేశాడు.

స్కోరు వివరాలు  
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) సుందర్‌ (బి) అర్ష్దీప్‌ 4; డకెట్‌ (సి) జురేల్‌ (బి) సుందర్‌ 3; బట్లర్‌ (సి) తిలక్‌ వర్మ (బి) అక్షర్‌ 45; బ్రూక్‌ (బి) వరుణ్‌ 13; లివింగ్‌స్టోన్‌ (సి) సబ్‌–హర్షిత్‌ (బి) అక్షర్‌ 13; స్మిత్‌ (సి) తిలక్‌ వర్మ (బి) అభిõÙక్‌ 22; ఓవర్టన్‌ (బి) వరుణ్‌ 5; కార్స్‌ (రనౌట్‌) 31; ఆర్చర్‌ (నాటౌట్‌) 12; రషీద్‌ (సి) సామ్సన్‌ (బి) పాండ్యా 10; మార్క్‌ వుడ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–6, 2–26, 3–59, 4–77, 5–90, 6–104, 7–136, 8–137, 9–157. బౌలింగ్‌: అర్ష్దీప్‌ 4–0–40–1, హార్దిక్‌ పాండ్యా 2–0–6–1, వాషింగ్టన్‌ సుందర్‌ 1–0–9–1, అక్షర్‌ 4–0–32–2, రవి బిష్ణోయ్‌ 4–0–27–0, వరుణ్‌ 4–0–38–2, అభిషేక్ 1–0–12–1. 

భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (సి) కార్స్‌ (బి) ఆర్చర్‌ 5; అభిõÙక్‌ (ఎల్బీ) (బి) వుడ్‌ 12; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 72; సూర్యకుమార్‌ (బి) కార్స్‌ 12; జురేల్‌ (సి) సబ్‌–రేహన్‌ (బి) కార్స్‌ 4; పాండ్యా (సి) సాల్ట్‌ (బి) ఓవర్టన్‌ 7; సుందర్‌ (బి) కార్స్‌ 26; అక్షర్‌ (సి) డకెట్‌ (బి) లివింగ్‌స్టోన్‌ 2; అర్ష్దీప్‌ (సి) ఆర్చర్‌ (బి) రషీద్‌ 6; బిష్ణోయ్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–15, 2–19, 3–58, 4–66, 5–78, 6–116, 7–126, 8–146. బౌలింగ్‌: జోఫ్రా ఆర్చర్‌ 4–0–60–1, మార్క్‌ వుడ్‌ 3–0–28–1, కార్స్‌ 4–0–29–3, ఆదిల్‌ రషీద్‌ 4–0–14–1, ఓవర్టన్‌ 2.2–0–20–1, లివింగ్‌స్టోన్‌ 2–0–14–1.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement