భారత మహిళల కీలక గెలుపు
5 వికెట్లతో బంగ్లాదేశ్ చిత్తు
షఫాలీ వర్మ అర్ధ సెంచరీ
మాంచెస్టర్: ఏకంగా నాలుగు క్యాచ్‌లు నేలపాలు, పేలవ ఫీల్డింగ్, బ్యాటింగ్‌లోనూ చివర్లో కాస్త తడబాటు... అయినా సరే చివరకు భారత మహిళల జట్టుకు కీలక విజయం దక్కింది. డెత్ ఓవర్లలో పదునైన బౌలింగ్‌తో పాటు షఫాలీ మెరుపులతో జట్టు గట్టెక్కింది. టి20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. గురువారం జరిగిన గ్రూప్–1 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. జువేరియా ఫిర్దోస్ (31 బంతుల్లో 33; 5 ఫోర్లు), కెప్టెన్ నిగార్ సుల్తానా (27 బంతుల్లో 32; 4 ఫోర్లు), శోభన (22) రాణించారు. రాధ యాదవ్ (3/28) మూడు వికెట్లు పడగొట్టగా, ఆంధ్ర అమ్మాయి శ్రీచరణికి 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 16.5 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (34 బంతుల్లో 53; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (18 బంతుల్లో 23; 3 ఫోర్లు) తలా ఓ చేయి వేశారు. రితూ మోని 2 వికెట్లు తీసింది. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. భారత్ ఫీల్డింగ్ మెరుగ్గా ఉంటే బంగ్లా మరింత తక్కువ స్కోరుకే పరిమితమయ్యేది. ఐదో ఓవర్ కూడా పూర్తి కాక ముందే భారత్ నాలుగు క్యాచ్‌లు వదిలేసింది.
ఇందులో ఫిర్దోస్‌వే 3 క్యాచ్‌లు ఉన్నాయి. యస్తిక, రాధ, నందిని (2) ఈ క్యాచ్‌లు జారవిడిచారు. దీనిని వాడుకున్న బంగ్లా బ్యాటర్లు ఆ తర్వాత వేగంగా పరుగులు జోడించారు. 106/3తో బంగ్లా మెరుగైన స్థితిలోనే నిలిచింది. అయితే ఈ దశలో మన బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. 30 పరుగుల వ్యవధిలో బంగ్లా తర్వాతి 5 వికెట్లు చేజార్చుకుంది. ఆరంభంలో వరుస బంతుల్లో రెండు క్యాచ్‌లు చేజారడంతో వికెట్ అవకాశం కోల్పోయిన శ్రీచరణి... ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 2 వికెట్లు పడగొట్టింది.
ఛేదనలో స్మృతి మంధాన (8) తొందరగానే అవుటైనా... షఫాలీ దూకుడుతో భారత్ దూసుకుపోయింది. 4 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ వదిలేయడం కలిసొచ్చింది. పవర్ ప్లేలో జట్టు 63 పరుగులు చేయగా, 29 బంతుల్లోనే షఫాలీ అర్ధ సెంచరీ పూర్తయింది. యస్తిక, రిచా (10) తక్కువ వ్యవధిలోనే అవుట్ కాగా... ఒక దశలో వరుసగా 23 బంతుల పాటు బౌండరీ రాకపోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే 6 ఓవర్లలో 33 పరుగులు చేయాల్సిన స్థితిలో జెమీమా 6 బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, సిక్స్ బాది భారత్ పని సులువు చేసింది. ఆమె వెనుదిరిగినా... హర్మన్ (13 నాటౌట్), దీప్తి (5 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు.
12 ఒకే టి20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా శ్రీచరణి రికార్డు నెలకొల్పింది. తాజా ప్రపంచకప్‌లో శ్రీచరణి 4 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీసింది. 10 వికెట్లతో పూనమ్ యాదవ్ (2020లో) పేరిట ఉన్న రికార్డును శ్రీచరణి సవరించింది. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు అమెలియా కెర్ (న్యూజిలాండ్; 2024లో 15 వికెట్లు) పేరిట ఉంది.


