గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో సౌతాఫ్రికా పై చేయి సాధించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ముత్తుసామి (25*), వెర్రిన్ (1*) ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రోటీస్ జట్టుకు ఓపెనర్లు మార్క్రమ్ (38), రికెల్టన్ (35) శుభారంభాన్ని అందించారు. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే విధంగా పిచ్ తయారు చేయడంతో తొలి వికెట్‌ను సాధించేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.
జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో మార్‌క్రమ్‌ను ఔట్ చేయడంతో భారత్‌కు తొలి వికెట్ లభించింది. అనంతరం ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ టెంబా బవుమా (41) నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే రెండో సెషన్‌లో మాత్రం భారత బౌలర్లు పుంజుకున్నారు.
ముఖ్యంగా స్పిన్నర్లు కీలక వికెట్లు పడగొట్టారు. రికెల్టన్, స్టబ్స్, ముల్డర్‌లను కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు పంపగా.. బవుమాను జడ్డూ బోల్తా కొట్టించాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, జడేజా తలో వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ మాస్టర్ ప్లాన్.. అర్జున్ స్ధానంలో?


