టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు ఆఖరి సన్నాహకంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి సిరీస్ ఆరంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా తొలి టీ20 సందర్భంగా టీమిండియా స్టార్లు జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తమ స్థానాలు పదిలం చేసుకోగా.. గాయపడిన వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) స్థానంలో ఇషాన్ కిషన్ మూడో స్థానంలో వస్తాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
శ్రేయస్ అయ్యర్‌కు నిరాశే
ఫలితంగా టీ20లలో రీఎంట్రీ ఇవ్వాలన్న వన్డే స్టార్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మరోసారి నిరాశ తప్పదు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య బరిలోకి దిగుతాడని తెలిసిందే. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే సిద్ధంగా ఉన్నారు. ఏడు ఎనిమిది స్థానాల్లో శివం దూబేతో కలిసి హిట్టింగ్ ఆడే క్రమంలో రింకూ సింగ్‌కు కూడా తుదిజట్టులో చోటు ఖాయమే.
వరుణ్ చక్రవర్తికే ఓటు
స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్‌ను కాదని వరుణ్ చక్రవర్తి వైపే మేనేజ్‌మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇక పేసర్ల విభాగంలో ప్రధాన బౌలర్ బుమ్రాతో పాటు టీ20 వికెట్ల వీరుడు అర్ష్‌దీప్ సింగ్ స్థానం దక్కించుకోవడం సహజమే.
కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా, బుమ్రాలకు విశ్రాంతినివ్వగా.. ఈ ఇద్దరి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఆడారు. ఆఖరిదైన మూడో వన్డేల్లో నితీశ్ (53), హర్షిత్ (52) అర్ధ శతకాలతో అలరించారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడినా విరాట్ కోహ్లి (124)తో కలిసి కాస్తైనా పరువు నిలిచేలా చేశారు.
అతడిపై వేటు తప్పదు
అయితే, టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్, బుమ్రా తిరిగి వచ్చారు. పాండ్యా ఉన్నాడు కాబట్టి నితీశ్ రెడ్డిని టీ20లకు ఎంపిక చేయలేదు. ఇక బుమ్రా కూడా వచ్చాడు కాబట్టి తొలి టీ20 సందర్భంగా హర్షిత్ రాణాపై వేటు పడక తప్పదని తెలుస్తోంది. ఒకవేళ లోయర్ ఆర్డర్‌లో హర్షిత్ బ్యాటింగ్‌కు ఉపయోగపడతాడని భావించినా.. టాపార్డర్ పటిష్టంగానే ఉన్న కారణంగా ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా అతడి అవసరం ఉండకపోవచ్చు. అందుకే బుమ్రాకు తోడుగా అర్ష్‌దీప్ రంగంలోకి దిగుతాడని తెలుస్తోంది.
న్యూజిలాండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు (అంచనా)
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
చదవండి: T20 WC: సూర్యకుమార్ యాదవ్‌కు రోహిత్ శర్మ వార్నింగ్


