
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించిలేక భారత జట్టు చతికల పడింది.
ఈ స్వల్ప లక్ష్య చేధనలో 170 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినప్పటికి జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
ఆరంభం నుంచే..
జడేజాతో పాటు కేఎల్ రాహుల్(54) పర్వాలేదన్పించగా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 58/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. ఆరంభం నుంచే తడబడింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ వరుస క్రమంలో పెవిలియన్‌కు చేరారు.
ఆ తర్వాత రవీంద్ర జడేజా, నితీశ్ కాసేపు నిలకడగా ఆడి భారత గెలుపుపై ఆశలు రెకెత్తించారు. అయితే లంచ్ బ్రేక్‌కు ముందు నితీశ్ ఔట్ కావడంతో మ్యాచ్ మళ్లీ ఇంగ్లండ్ వైపు టర్న్ అయింది. ఆ తర్వాత జడేజా.. జస్ప్రీత్ బమ్రాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
బుమ్రా ఇంగ్లండ్ పేసర్లను ఎదుర్కొంటూ జడేజాకు మద్దతుగా నిలిచాడు. అయితే 50 బంతులకు పైగా బ్యాటింగ్ చేసిన బుమ్రా(5) భారీ షాట్‌కు ప్రయత్నించి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ సైతం తన వంతు సహకారం అందించాడు.
కానీ ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్‌లో సిరాజ్ బౌల్డ్ కావడంతో టీమిండియా అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. సిరాజ్ సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. ఇంగ్లండ్ మాత్రం గెలుపు సంబరాల్లో మునిగి తేలిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా మూడు వికెట్లు పడగొట్టి గిల్ సేన పతనాన్ని శాసించారు.
వీరిద్దరితో పాటు కార్స్ రెండు, బషీర్, వోక్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకే చేయగల్గింది. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బౌలర్లు అద్బుతంగా రాణించినప్పటికి.. బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
చదవండి: మెడ చుట్టూ చేయి వేసి ఆపేశాడు!.. ఇచ్చిపడేసిన జడ్డూ