నిన్న యశస్వి.. నేడు బుమ్రా.. ఆధిక్యంలో టీమిండియా | Ind vs Eng, 2nd Test Day 2: Bumrah Breaks England Back, Lead By 171 Runs - Sakshi
Sakshi News home page

Day 2@Vizag: బుమ్రా మ్యాజిక్‌.. భారీ ఆధిక్యంలో టీమిండియా! హైలైట్స్‌

Published Sat, Feb 3 2024 5:38 PM

Ind vs Eng 2nd Test Vizag Day 2 Bumrah Breaks England Back Lead 171 Runs - Sakshi

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం చాటుకుంది. వైజాగ్‌లో శనివారం నాటి ఆట ముగిసే సరికి 171 పరుగుల ఆధిక్యం సంపాదించింది. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

రెండో రోజు డబుల్‌ సెంచరీగా మలిచి
ఈ క్రమంలో  తొలి రోజు భారీ సెంచరీ చేసిన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌.. రెండో రోజు దానిని డబుల్‌ సెంచరీగా మార్చాడు. ఇక 209 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి అవుట్‌ కాగా..  టీమిండియా 396 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. శనివారం 336/6 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండు రోజు ఆటను  ఆరంభించిన భారత్‌.. అదనంగా 60 పరుగులు జత చేయగలిగింది.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు దిగగా ఓపెనర్‌ బెన్‌ డకెట్‌(21) కుల్దీప్‌ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలే(76) పట్టుదలగా నిలబడ్డాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ అద్భుత అర్ధ శతకంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.

వికెట్ల వేట మొదలుపెట్టి.. ఘనంగా ముగించి
అయితే, అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో బంతిని తప్పుగా అంచనా వేసి షాట్‌ ఆడాలని క్రాలే భావించగా.. శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత క్యాచ్‌తో అతడికి సెండాఫ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తన వికెట్ల వేట మొదలుపెట్టాడు.

హైదరాబాద్‌ టెస్టు హీరో ఒలీ పోప్‌(23), జో రూట్‌(5), బెయిర్‌ స్టో(25), కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌(47) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్‌ చేసిన బుమ్రా.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల క్లబ్‌లో చేరాడు.

ఇక టామ్‌ హార్లీ వికెట్‌తో ఈ మ్యాచ్‌లో ఫైఫర్‌ సాధించిన ఈ రైటార్మ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(6)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఆఖరి వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో బుమ్రాకు ఆరు, కుల్దీప్‌ యాదవ్‌కు మూడు, అక్షర్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

171 పరుగుల ఆధిక్యంలో భారత్‌
ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓవరాల్‌గా 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ 13, యశస్వి జైస్వాల్‌ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో గెలిచి 1-1తో సమం చేయాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది. 

చదవండి: ఇలాంటి బాల్‌ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్‌ బౌల్డ్‌.. రియాక్షన్‌ వైరల్‌

Advertisement
Advertisement