
భారత జట్టు చివరిసారిగా ఇంగ్లండ్ గడ్డపై 2007లో 1–0తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత నాలుగుసార్లు మన టీమ్ అక్కడకు వెళ్లింది. 2011లో 0–4తో చిత్తుగా ఓడిన జట్టు... 2014, 2018లలోనూ సిరీస్‌లు కోల్పోయింది. 2021 సిరీస్‌ను మాత్రం సమంగా ముగించగలిగింది.
ఈసారి జట్టు ఇంగ్లండ్ బయల్దేరినప్పుడు కూడా ఎన్నో సందేహాలు. కోహ్లి, రోహిత్, అశ్విన్ రిటైర్ అయిన తర్వాత ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో పాటు ఎక్కువ మందికి అనుభవం పెద్దగా లేకపోవడంతో కూడా అంచనాలు తక్కువగా ఉన్నాయి.
అవును.. ‘డ్రా’ కూడా గెలుపు సంబరమే
భారత మాజీ క్రికెటర్లు సహా ప్రసారకర్తల బృందంలో ఉన్నవారంతా ఇంగ్లండ్ సిరీస్ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. భారత్ కొంత వరకు పోరాడుతుందని, సిరీస్ తుది ఫలితంలో మాత్రం మార్పు ఉండదని వారంతా వ్యాఖ్యానించారు. కానీ టీమిండియా తమ అసాధారణ ఆటతో అందరి నోళ్లు మూయించింది.
ఈ పర్యటనకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడి, ఆపై ఆస్ట్రేలియాలో 1–3తో చిత్తయిన జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లి ఈ తరహా ఫలితంతో తిరిగి రావడం చాలా గొప్ప ప్రదర్శన. అంకెల్లో చూస్తే సిరీస్ ‘డ్రా’గా ముగిసిందని, భారత్ గెలవలేదని అనిపించవచ్చు కానీ మన కోణంలో చూస్తే ఇది విజయంతో సమానం.
సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు చూసినవారు ఎవరైనా ఇదే విషయాన్ని అంగీకరిస్తారు. ఐదు టెస్టుల్లో వేర్వేరు దశల్లో, సెషన్‌లలో మన జట్టు ఆధిక్యం కనబర్చిన తీరు, వెనకబడిన ప్రతీసారి కోలుకున్న పట్టుదల చూస్తే ‘డ్రా’ కూడా గెలుపు సంబరమే.
హోరాహోరీ పోరులో సత్తా చాటి...
తొలి టెస్టులో భారత్ చిత్తుగా ఏమీ ఓడలేదు. మన జట్టు తరఫున ఐదు సెంచరీలు నమోదయ్యాయి. ఆ జట్టు దూకుడుగా ఆడి 371 పరుగులు ఛేదించగలిగింది. రెండో టెస్టులో ఏకంగా 336 పరుగులతో ఘన విజయం సాధించి సరైన రీతిలో మనం బదులిచ్చాం.
లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్కోరు సమం. చివర్లో కాస్త అదృష్టం కలిసొస్తే ఈ మ్యాచ్ కూడా మన సొంతమయ్యేది. ఓల్డ్‌ట్రఫోర్డ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 311 పరుగులు వెనుకబడి కూడా పోరులో నిలవడం, ఓటమిని తప్పించుకోవడం మన పోరాటపటిమను చూపించింది.
రెండో ఇన్నింగ్స్‌లోనైతే సున్నాకి 2 వికెట్లు కోల్పోయిన తర్వాత మరో 2 వికెట్లు మాత్రమే చేజార్చుకొని 425 పరుగులు చేయడం అసాధారణం. ఒకదశలో ‘డ్రా’ కోసం ఇంగ్లండ్ ముందుకు రావడం, మన ఆటగాళ్లు నిరాకరించడం జట్టులో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని చూపించింది.
ఇది తర్వాతి టెస్టులో కనిపిస్తుందని వేసిన అంచనాలు సరిగ్గా నిజమయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసి, ఆపై దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే నిలువరించగలిగింది.
ఆకట్టుకున్న వ్యక్తిగత ప్రదర్శనలు...
సిరీస్‌లో సమష్టి ప్రదర్శన జట్టును ముందంజలో నిలిపింది. సిరాజ్ 23 వికెట్లు పడగొట్టగా, 3 మ్యాచ్‌లలో బుమ్రా 14 వికెట్లు తీశాడు. పరుగులు భారీగా ఇచ్చినా... ప్రసిధ్ కృష్ణ (14), ఆకాశ్‌దీప్ (13) కీలక సమయాల్లో వికెట్లు తీశారు. జడేజా బౌలర్‌గా విఫలమైనా ఆ లోటును బ్యాటింగ్‌తో పూరించాడు. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు 500కు పైగా పరుగులు చేసి తామేంటో చూపించారు.
శుబ్‌మన్ గిల్ (754), కేఎల్ రాహుల్ (532), జడేజా (516) చెలరేగగా... పంత్ (479), జైస్వాల్ (411) కూడా తమవంతు పాత్ర పోషించారు. మున్ముందు అశ్విన్ స్థానాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయగల ఆల్‌రౌండర్‌గా సుందర్ నిరూపించుకున్నాడు.
మాంచెస్టర్‌లో సెంచరీతో పాటు చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను బాదిన 4 సిక్సర్లు తుది ఫలితంపై ప్రభావం చూపాయి. క్రికెట్‌ను మరో అవకాశం అడిగిన కరుణ్ నాయర్ అద్భుతంగా ఆడకపోయినా...చివరి టెస్టు హాఫ్ సెంచరీ అతడికి మరో అవకాశం కల్పించవచ్చు.
ఇద్దరికీ పాస్ మార్కులు... గెలుపు విలువ వారికే తెలుసు
ఈ టెస్టు సిరీస్ ప్రధానంగా కెప్టెన్‌గా గిల్, కోచ్ గంభీర్‌లకు వ్యక్తిగతంగా ఎంతో కీలకమైంది. ఈ సిరీస్‌కు ముందు పేలవ సగటుతో బ్యాటర్‌గా కూడా గొప్ప రికార్డు లేని గిల్ అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా కూడా నిరూపించుకోవాల్సిన స్థితి. ఇందులో ఏది విఫలమైనా అతనిపై తీవ్ర విమర్శలు వచ్చేవి. అయితే గిల్ ఇప్పుడు విజయవంతంగా దీనిని ముగించాడు. టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు కెప్టెన్‌గా సిరీస్‌ను కోల్పోలేదు.
అక్కడక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా తొలి సిరీస్ కాబట్టి క్షమించే పరిస్థితి ఉంది. ఇక గత రెండు టెస్టు సిరీస్‌లు కోల్పోయిన తర్వాత గంభీర్‌పై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. ముఖ్యంగా కోహ్లి, రోహిత్‌లను తానే సాగనంపి జట్టుపై పూర్తి పట్టు పెంచుకున్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అతని ప్రతీ ప్రణాళికపై అందరి దృష్టీ ఉంది.
ముఖ్యంగా ఇక్కడ ఓడితే కొన్ని అనూహ్య ఎంపికలకు అతను సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చేది. ఇక తాజా ప్రదర్శనతో గంభీర్ నిశ్చింతగా ఉండవచ్చు. భారత్ తమ తదుపరి టెస్టు సిరీస్‌ను స్వదేశంలో వెస్టిండీస్‌తో ఆడనుంది. 27 ఆలౌట్ తర్వాత ఆ జట్టు ఆడనున్న తొలి మ్యాచ్ ఇక్కడే కానుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత మన జట్టు ప్రదర్శనను విశ్లేషిస్తే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా జోరు కొనసాగడం ఖాయం.
-సాక్షి క్రీడా విభాగం
చదవండి: కన్నీటిపర్యంతమైన గంభీర్.... గూస్‌బంప్స్ తెప్పించేశారు భయ్యా! వీడియో వైరల్