IND VS ENG 1st Test, Day 5: తొలి సెషన్‌ వారిదే.. లక్ష్యం దిశగా సాగుతున్న ఇంగ్లండ్‌ | IND VS ENG 1st Test, Day 5: England Scored 117 Runs Without Losing Wicket In First Session | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test, Day 5: తొలి సెషన్‌ వారిదే.. లక్ష్యం దిశగా సాగుతున్న ఇంగ్లండ్‌

Jun 24 2025 5:58 PM | Updated on Jun 24 2025 7:15 PM

IND VS ENG 1st Test, Day 5: England Scored 117 Runs Without Losing Wicket In First Session

లీడ్స్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ రసపట్టులో సాగుతోంది. 350 పరుగుల లక్ష్య ఛేదనలో చేతిలో 10 వికెట్లు పెట్టుకొని చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ తొలి సెషన్‌లో అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (64 నాటౌట్‌), జాక్‌ క్రాలే (42 నాటౌట్‌) అద్బుతమైన పోరాటపటిమ కనబరుస్తూ తొలి సెషన్‌లో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. 

ఈ ఇద్దరు తొలి సెషన్‌లో అజేయమైన 96 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన డకెట్‌ ఈ ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీ చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. క్రాలేతో పోలిస్తే డకెట్‌ ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్‌ గెలుపుపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. క్రాలే బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. 

చివరి రోజు లంచ్‌ విరామం సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 117 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో రెండు సెషన్లలో 254 పరుగులు చేయాల్సి ఉంది. అదే భారత్‌ గెలవాలంటే 10 వికెట్లు తీయాల్సి ఉంటుంది. మొత్తానికి భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఓపెనర్లు తొలి సెషన్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

వాతావరణ ముందస్తు హెచ్చరికలో ఇవాళ వర్షం పడే అవకాశముందని తెలిపింది. అయితే వరుణుడు తొలి సెషన్‌లో ఎలాంటి బ్రేకులు వేయలేదు. మ్యాచ్‌ సజావుగా సాగుతుంది. ఇంగ్లండ్‌ ఓపెనర్లు ఒక్కో పరుగును పేరుస్తూ.. తమ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు. 

తొలి సెషన్‌లో భారత బౌలర్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ప్రసిద్ద్‌ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. సెషన్‌ ముగియడానికి ముందు బంతి మార్పిడి జరిగింది. కొత్త బంతితో కూడా భారత బౌలర్లకు ఎలాంటి ఫలితం రాలేదు. వరుణుడి నుంచి ఎలాంటి ఆటంకం ఉండకపోతే తదుపరి రెండు సెషన్లలో భారత బౌలర్లు 66 ఓవర్లు బౌల్‌ చేయాల్సి ఉంటుంది.

స్కోర్‌ వివరాలు..
భారత్‌: 471 (జైస్వాల్‌ 101, గిల్‌ 147, పంత్‌ 134) & 364 (రాహుల్‌ 137, పంత్‌ 118)
ఇంగ్లండ్‌: 465 (పోప్‌ 106, బ్రూక్‌ 99) & 117/0 (డకెట్‌ 64 నాటౌట్‌, క్రాలే 42 నాటౌట్‌)

 

 

Advertisement
 
Advertisement
Advertisement