
ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో టీమిండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) విఫలమయ్యాడు. భారత్-‘ఎ’ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.
కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్.. ప్రాక్టీస్ కోసం భారత్-‘ఎ’ జట్టులో చేరిన విషయం తెలిసిందే. ఆసీస్ (IND A vs AUS A)తో రెండో అనధికారిక టెస్టు సందర్భంగా వీరిద్దరు ఎంట్రీ ఇచ్చారు. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఆసీస్ భారీ స్కోరు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 97.2 ఓవర్లలో 420 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (49), వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ 39 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీన్ భారీ అర్ధ శతకం (74)తో రాణించాడు. మిగతా జాక్ ఎడ్డర్డ్స్ 88 పరుగులు, టాడ్ మర్ఫీ 76 పరుగులతో సత్తా చాటగా.. హెన్రీ థార్న్‌టన్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఐదేసిన మానవ్ సుతార్
భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్ గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ
కాగా బుధవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా 350/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన ఆసీస్.. మరో డెబ్బై పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌కు మొదలు పెట్టిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
రాహుల్ ఫెయిల్
ఓపెనర్‌గా వచ్చిన సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఆసీస్ యువ పేసర్ విల్ సదర్లాండ్ బోల్తా కొట్టించాడు. అతడి బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోష్ ఫిలిప్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్న రాహుల్ ఒకే ఒక్క ఫోర్ బాది.. 11 పరుగులు చేసి నిష్క్రమించాడు.
ఈ నేపథ్యంలో భోజన విరామ సమయానికి భారత్ పది ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ కంటే ఇంకా 382 పరుగులు వెనుకబడి ఉంది.ఇక లంచ్ ముగిసిన వెంటనే భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మరో ఓపెనర్ నారాయణ్ జగదీశన్ థార్న్‌టన్ బౌలింగ్‌లో సదర్లాండ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 14 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి సాయి సుదర్శన్ 4, దేవ్‌దత్ పడిక్కల్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరు: 61-2.
ఆస్ట్రేలియా-‘ఎ’తో రెండో అనధికారిక టెస్టుకు భారత్-‘ఎ’ తుది జట్టు
నారాయణ్ జగదీశన్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ (కెప్టెన్- వికెట్ కీపర్), ఆయుష్ బదోని, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్.