
ఆస్ట్రేలియా గడ్డపై భారత అండర్-19 జట్టు జోరు కొనసాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఆసీస్ అండర్-19 జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది.
ఆసీస్ బ్యాటర్లలో స్టీవన్ హోగన్(92) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ 5 వికెట్లు పడగొట్టగా.. కిషన్ కుమార్ మూడు వికెట్లు సాధించాడు. అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 81.3 ఓవర్లలో 428 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
భారత బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (86 బంతుల్లో 113; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు), వేదాంత్ త్రివేది (192 బంతుల్లో 140; 19 ఫోర్లు) అద్బుమైన సెంచరీలతో కదం తొక్కారు. ఇప్పటికే ఐపీఎల్‌లో దంచికొట్టిన 14 ఏళ్ల వైభవ్... టెస్టును సైతం టి20 తరహాలో ఆడాడు.
ఆసీస్ బౌలర్లను ఏమాత్రం ఉపేక్షించకుండా... భారీ షాట్‌లతో విరుచుకుపడ్డాడు. . ఆసీస్ పేసర్లను ఓ ఆటాడుకున్న వైభవ్... వేదాంత్‌తో కలిసి మూడో వికెట్‌కు 152 పరుగులు జోడించాడు. వీరిద్దరితో పాటు ఖిలాన్ పటేల్ (49 బంతుల్లో 49; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆయుశ్ మాత్రే (21), అభిజ్ఞ కుందు (26), రాహుల్ కుమార్ (23) రాణించారు.దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ్రస్టేలియా బౌలర్లలో హెడెన్, విల్ మలాచుక్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
127 పరుగులకే ఆలౌట్..
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ల ఆట తీరు ఏమాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దేవంద్రన్, ఖిలాన్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించారు.
వీరిద్దరితో పాటు కిషాన్ కుమార్, అన్మోల్జీత్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో ఆర్యన్ శర్మ(43) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు అక్టోబర్ 7 నుంచి మెక్‌కే వేదికగా ప్రారంభం కానుంది. కాగా మూడు వన్డేల యూత్ సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: WC 2025: వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. న్యూజిలాండ్ చిత్తు