PC: BCCI Twitter
టీమిండియా స్టార్ ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌కు సంబంధించి జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో వన్డేనే రోహిత్‌కు భారత్ తరపున ఆఖరి మ్యాచ్ అని జాతీయ మీడియాలో సైతం కథనాలు వెలువడ్డాయి.
అయితే 'హిట్‌మ్యాన్' భవిష్యత్తు ప్రణాళికల్లో కొనసాగుతాడని, లార్డ్స్ వన్డే అతడి చివరి మ్యాచ్ కాదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ రోహిత్ కంటే ముందే మరో ముగ్గురు భారత స్టార్ ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌కు గుడ్-బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
మహ్మద్ షమీ
ఈ జాబితాలో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఉంటాడు. షమీ గతేడాదిగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్- 2023లో భారత్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన షమీ.. ఆ తర్వాత గాయాల కారణంగా రెండేళ్లపాటు ఆటకు దూరమయ్యాడు. తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు అతడు భారత జట్టులోకి వచ్చాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి.. అతడు మళ్లీ జట్టులో చోటు కోల్పోయాడు. ఫిట్‌నెస్ సమస్యల పరంగా అతడిని పక్కన పెట్టనట్లు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఆ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్‌లో రాణించినప్పటికి సెలక్టర్లు మాత్రం జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు.
అతడి స్దానంలో యువ బౌలర్లను సెలెక్షన్ కమిటీ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ యువ పేసర్లు సత్తాచాటుతున్నారు. దీంతో షమీకి తిరిగి భారత జట్టులో చోటు దక్కే సూచనలు కనిపించం లేదు. ఈ క్రమంలో 35 ఏళ్ల షమీ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆశ్చర్యపోనక్కర్లేదు. షమీ తన కెరీర్‌లో మూడు ఫార్మాట్లు కలిపి 405 వికెట్లు పడగొట్టాడు.
యుజ్వేంద్ర చహల్
ఇక ఈ జాబితాలో రెండో పేరు యుజ్వేంద్ర చహల్. చాహల్ 2023 నుంచి ఇప్పటివరకు భారత్ తరపున ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం జట్టులో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఫ్రంట్‌లైన్ స్పిన్నర్లుగా ఉన్నారు. అంతేకాకుండా హర్ష్ దూబే, మానవ్ సుతార్ వంటి యువ ఆటగాళ్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. వీరికి తోడు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో చాహల్ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.
రవీంద్ర జడేజా
ఇక స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా త్వరలోనే వన్డేల నుంచి తప్పుకోనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికిన జడ్డూ.. ప్రస్తుతం కేవలం వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్నాడు. వన్డేల్లో కూడా అతడికి అవకాశం రావడం లేదు. అఫ్గాన్ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో వన్డేలకు అతడిని పక్కన పెట్టారు.
2023 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత జడేజా కేవలం 13 వన్డేలు మాత్రమే ఆడాడు. ముఖ్యంగా 2026లో ఆడిన 3 వన్డేల్లో కేవలం 43 పరుగులు మాత్రమే చేసి, ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో అతడికి ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. దీంతో జడేజా వన్డేలకు వీడ్కోలు పలికి కేవలం టెస్టుల్లోనే కొనసాగే ఛాన్స్ ఉంది.


