మన కథ ముగిసె... | ICC Womens T20 WC 2026: Australia Beat And Eliminates India | Sakshi
Sakshi News home page

మన కథ ముగిసె...

Jun 28 2026 10:13 PM | Updated on Jun 29 2026 11:39 AM

ICC Womens T20 WC 2026: Australia Beat And Eliminates India

చివరి లీగ్‌ మ్యాచ్‌లో పరాజయం

6 వికెట్లతో నెగ్గిన ఆస్ట్రేలియా

మెరిసిన పెర్రీ, గార్డ్‌నర్‌

హర్మన్‌ మెరుపులు వృథా

లండన్‌: టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు తడబడింది. మొదట బ్యాటింగ్‌లో మంచి స్కోరు చేసినా... దాన్ని కాపాడుకోవడంలో విఫలమై వరల్డ్‌కప్‌ నుంచి ని్రష్కమించింది. గ్రూప్‌–1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా 6 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్‌ ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. గ్రూప్‌ దశలో ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, రెండు పరాజయాలతో 6 పాయింట్లకే పరిమితమైన భారత్‌... గ్రూప్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. 

ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆ్రస్టేలియా (10 పాయింట్లు), నాలుగింట గెలిచిన దక్షిణాఫ్రికా (8 పాయింట్లు) సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. కీలక పోరులో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియాపై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (27 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా... స్మృతి మంధాన (37 బంతుల్లో 38; 6 ఫోర్లు), షఫాలీ వర్మ (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్‌ (28 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. 

అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఎలీస్‌ పెర్రీ (38 బంతుల్లో 56; 8 ఫోర్లు), ఆష్లే గార్డ్‌నర్‌ (29 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో జట్టును గెలిపించారు. భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్‌తో ఆ్రస్టేలియా; గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్‌ తలపడతాయి.   

హర్మన్‌ ‘హ్యాట్రిక్‌’ సిక్స్‌లు... 
ఓపెనర్లు మెరుగైన ఆటతీరు కనబర్చడంతో... టీమిండియాకు శుభారంభం దక్కింది. స్మృతి, షఫాలీ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. షఫాలీ అవుటైన కాసేపటికే లేని పరుగు కోసం ప్రయత్నించి స్మృతి రనౌట్‌ అయింది. జెమీమా ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో... 18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 134/2తో నిలిచింది. అయితే ఆఖర్లో హర్మన్‌ దంచికొట్టడంతో జట్టు మంచి స్కోరు చేయగలిగింది. 

హర్మన్‌ 19వ ఓవర్‌లో ఓ ఫోర్‌ కొట్టగా... జెమీమా సిక్స్‌ బాదింది. దీంతో 13 పరుగులు రాగా...  ఆసీస్‌ సారథి మొలినెక్స్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో హర్మన్‌ ‘హ్యాట్రిక్‌’ సిక్స్‌లతో స్టేడియాన్ని హోరెత్తించింది. వరుసగా నాలుగో సిక్స్‌ కొట్టే ప్రయత్నంలో హర్మన్‌ అవుటవ్వగా... చివరి బంతికి దీప్తి (4 నాటౌట్‌) ఫోర్‌ కొట్టడంతో భారత్‌ స్కోరు 170కి చేరింది. చివరి రెండు ఓవర్లలో టీమిండియా 36 పరుగులు రాబట్టడం విశేషం.  

సెంచరీ భాగస్వామ్యం... 
ఛేదనలో రెండో బంతికే జార్జియా వాల్‌ (4) వికెట్‌ కోల్పోయినా... ఆసీస్‌కు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. బెత్‌ మూనీ (22), లిచ్‌ఫీల్డ్‌ (24) ఫర్వాలేదనిపించగా... ఒకదశలో 68/3తో కష్టాల్లో పడ్డట్లు కనిపించిన ఆ్రస్టేలియాపై ఒత్తిడి పెంచడంలో మన బౌలర్లు విఫలమయ్యారు. పెర్రీ, గార్డ్‌నర్‌ జంట ఎలాంటి అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయి లక్ష్యాన్ని కరిగింది. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 59 బంతుల్లోనే 100 పరుగులు జతచేయడంతో ఆసీస్‌ అలవోకగా విజయం సాధించింది.  

89 మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్‌ నిలిచింది. 88 సిక్స్‌లతో స్మృతి మంధాన పేరిట ఉన్న రికార్డును హర్మన్‌ సవరించింది.

5 టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించడం ఇది ఐదోసారి. పదోసారి ప్రపంచకప్‌లో ఆడిన భారత జట్టు 2012, 2014, 2016, 2024, 2026లలో లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. 2009, 2010, 2018, 2023లలో సెమీఫైనల్లో ఓడిన భారత జట్టు 2018లలో రన్నరప్‌గా నిలిచింది.

స్కోరు వివరాలు 
భారత మహిళల ఇన్నింగ్స్‌: స్మృతి (రనౌట్‌) 38; షఫాలీ (బి) మొలినెక్స్‌ 34; జెమీమా (రిటైర్డ్‌ అవుట్‌) 34; హర్మన్‌ప్రీత్‌ (సి) పెర్రీ (బి) మొలినెక్స్‌ 56; రిచా (నాటౌట్‌) 1; దీప్తి (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–66, 2–83, 3–147, 4–166. బౌలింగ్‌: లూసీ హామిల్టన్‌ 3–0–17–0; కిమ్‌ గార్త్‌ 3–0–24–0; గార్డ్‌నర్‌ 2–0–25–0; పెర్రీ 1–0–7–0; జార్జియా వేర్‌హమ్‌ 3–0–16–0; అనాబెల్‌ సదర్లాండ్‌ 4–0–35–0; మొలినెక్స్‌4–0–46–2. 

ఆ్రస్టేలియా మహిళల ఇన్నింగ్స్‌: జార్జియా వాల్‌ (ఎల్బీ) (బి) రేణుక 4; మూనీ (సి) రాధ (బి) దీప్తి 22; లిచ్‌ఫీల్డ్‌ (సి) స్మృతి (బి) శ్రీచరణి 24; పెర్రీ (సి) షఫాలీ (బి) శ్రీచరణి 56; గార్డ్‌నర్‌ (నాటౌట్‌) 53; వేర్‌హమ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–4, 2–54, 3–68, 4–168. బౌలింగ్‌: రేణుక 4–0–41–1; క్రాంతి 1–0–12–0; షఫాలీ 4–0–29–0; శ్రీ చరణి 4–0–32–2; దీప్తి 4–0–31–1; 2–0–24–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement