ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన పాక్‌ | ICC under 19 world cup 2026: Pakistan beat scotland by 6 wickets | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన పాక్‌

Jan 19 2026 8:40 PM | Updated on Jan 19 2026 8:40 PM

ICC under 19 world cup 2026: Pakistan beat scotland by 6 wickets

జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌-2026లో పాకిస్తాన్‌ బోణీ కొట్టింది. స్కాట్లాండ్‌తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు  6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. 48.1 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. అలీ రజా (10-0-37-4) అద్భుతమైన బౌలింగ్‌తో స్కాట్లాండ్‌ పతనాన్ని శాశించాడు. మొమిన్‌ కమర్‌ 3 వికెట్లతో సత్తా చాటాడు. మొహమ్మద్‌ సయ్యమ్‌, అబ్దుల్‌ సుభాన్‌ తలో వికెట్‌ తీశారు. 

స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన థామస్‌ నైట్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఫిన్లే జోన్స్‌ (33), ఓల్లీ జోన్స్‌ (30), మను సరస్వత్‌ (25), రోరి గ్రాంట్‌ (21), ఫిన్లే కార్టర్‌ (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్‌కు సరస్వత్‌, ఫిన్లే జోన్స్‌ 58 పరుగులు జోడించడంతో స్కాట్లాండ్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ ఆచితూచి ఆడి 43.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఉస్మాన్‌ ఖాన్‌ (75), అహ్మద్‌ హుసేన్‌ (47) పాక్‌ గెలుపులో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్‌ ఫర్హాన్‌ (18 నాటౌట్‌) పాక్‌ను గెలుపు తీరాలు దాటించాడు. పాక్‌ ఇన్నింగ్స్‌లో అలీ హసన్‌ బలోచ్‌ 15, స్టార్‌ బ్యాటర్‌ సమీర్‌ మిన్హాస్‌ 28 పరుగులు చేశారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో ఓల్లీ జోన్స్‌, సరస్వత్‌ తలో 2 వికెట్లు తీశారు. 

కాగా, ఈ మెగా టోర్నీలో పాక్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో చిత్తైంది తదుపరి మ్యాచ్‌లో ఈ జట్టు జింబాబ్వేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాక్‌ సూపర్‌-8కు చేరుకుంటుంది.

ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో అరంగేట్రీ టాంజానియాపై సౌతాఫ్రికా 329 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్‌ బుల్‌బులియా, జేసన్‌ రోల్స్‌ శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన టాంజానియా 32.2 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. 

ఇవాళే మరో మ్యాచ్‌ కూడా జరుగుతుంది. శ్రీలంక-ఐర్లాండ్‌ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలుపు దిశగా పయనిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement