వచ్చే ఏడాది అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు వన్డే వరల్డ్‌కప్
భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 10న
షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
దుబాయ్: వచ్చే ఏడాది జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. కొత్త ఫార్మాట్‌లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ వివరాలను ఐసీసీ గురువారం విడుదల చేసింది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని వచ్చే ఏడాది అక్టోబర్ 2న 14వ వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఆడనుంది.
అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత జట్టు అక్టోబర్ 10న తలపడనుంది. మొత్తం 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, జింబాబ్వేతో కలిసి భారత్ బరిలోకి దిగనుంది. మరో జట్టును క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఎంపిక చేయనున్నారు. గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, క్వాలిఫయర్ ‘బి’ జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో జరిగే గ్రూప్ దశలో మొత్తం 30 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌ల అనంతరం టీమిండియా వరుసగా అఫ్గానిస్తాన్ (అక్టోబర్ 14), క్వాలిఫయర్ ‘ఎ’ (అక్టోబర్ 17), జింబాబ్వే (అక్టోబర్ 24)లతో తలపడుతుంది. ఒక్కో గ్రూప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన మూడు జట్లతో పాటు రెండు గ్రూప్‌ల్లో కలిపి ఆ తర్వాతి అత్యుత్తమ జట్టు ‘సూపర్–7’ దశకు చేరుతుంది. ఇందులోనూ ఒక్కో జట్లు మిగిలిన అన్నీ జట్లతో రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో పోటీపడాల్సి ఉంటుంది. టాప్–4 జట్లు సెమీఫైనల్‌కు చేరనున్నాయి. నవంబర్ 17, 18న సెమీఫైనల్స్ నిర్వహిస్తారు. నవంబర్ 21న జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానంలో జరగనున్న ఫైనల్‌తో టోర్నమెంట్ ముగుస్తుంది.


