ఇకపై వన్డేల్లో ఒకటే బంతి! | ICC key meeting today | Sakshi
Sakshi News home page

ఇకపై వన్డేల్లో ఒకటే బంతి!

Apr 13 2025 2:09 AM | Updated on Apr 13 2025 2:09 AM

ICC key meeting today

నేడు ఐసీసీ కీలక సమావేశం

డబ్ల్యూటీసీ పాయింట్ల కేటాయింపు పైనా చర్చ

పురుషుల అండర్‌–19 ప్రపంచకప్‌ టి20 ఫార్మాట్‌లో!

న్యూఢిల్లీ: బ్యాటర్లకు అనుకూలంగా ఉన్న నిబంధనలను మార్చి ఆటలో బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానమైన ప్రాధాన్యత కల్పించడం... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల కేటాయింపు విధానంలో మార్పులు... పురుషుల అండర్‌–19 ప్రపంచకప్‌ పోటీలను 50 ఓవర్ల నుంచి 20 ఓవర్లకు తగ్గించడం ఇలాంటి పలు అంశాలపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం జింబాబ్వే రాజధాని హరారే వేదికగా ఐసీసీ బోర్డు సమావేశం జరగనుండగా... ఇందులో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. 

వన్డే క్రికెట్‌ బ్యాటర్లకు అనుకూలంగా ఉందనే దీర్ఘకాలిక ఆందోళనను పరిష్కరించే దిశగా... 50 ఓవర్ల ఫార్మాట్‌లో రెండు బంతుల నియమాన్ని మార్చే అవకాశాలున్నాయి. దశాబ్ద కాలంగా రెండు కొత్త బంతుల విధానం కొనసాగుతుండగా... భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్‌ కమిటీ వన్డేల్లో ఒకే బంతిని ఉపయోగించాలని సిఫార్సు చేసింది. ఆటలో పోటీతత్వం పెంపొందించేందుకు ఇది సహాయపడనుంది. ‘ఐసీసీ సమావేశంలో మూడు నిబంధనలపై చర్చ జరగనుంది. 

వన్డేల్లో ఒకే బంతి వినియోగం, టెస్టు క్రికెట్‌లో టైమర్‌ను ప్రవేశ పెట్టడం, పురుషుల అండర్‌–19 ప్రపంచకప్‌ను టి20 ఫార్మాట్‌లో నిర్వహించడంపై చర్చించే అవకాశం ఉంది’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. టెస్టు క్రికెట్‌లో ఓవర్‌కు ఓవర్‌కు మధ్య విరామాన్ని ఇకపై 60 సెకన్లకే పరిమతం చేయడంతో పాటు... రోజుకు 90 ఓవర్లు పూర్తి చేసే దిశగా మరింత పకడ్బందీ నిబంధనలను రూపొందించనున్నారు. 2026లో జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనున్న పురుషుల అండర్‌–19 వరల్డ్‌కప్‌ను టి20 ఫార్మాట్‌లో నిర్వహించే దిశగా చర్చ జరగనుంది. 

డబ్ల్యూటీసీ పాయింట్ల విధానంలోనూ మార్పులు!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల కేటాయింపు విధానంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న భారత్, ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌తో 2025–27 సర్కిల్‌ ప్రారంభం కానుంది. రగ్బీ తరహాలో... ప్రత్యర్థుల బలం ఆధారంగా విజయాలకు పాయింట్లు కేటాయించడంతో పాటు స్వదేశంలో గెలిచిన మ్యాచ్‌లు, విదేశాల్లో గెలిచిన మ్యాచ్‌లకు మధ్య వ్యత్యాసం తీసుకొచ్చే చాన్స్‌ ఉంది. 

అలాగే గెలుపు అంతరాన్ని బట్టి బోనస్‌ పాయింట్లను కేటాయించే కొత్త వ్యవస్థను తీసుకురావాలిన క్రీడా పాలకమండలి యోచిస్తోంది. ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ సర్కిల్‌లో టెస్టు మ్యాచ్‌ విజయానికి 12 పాయింట్లు, ‘టై’కు 6 పాయింట్లు, ‘డ్రా’కు 4 పాయింట్లు కేటాయిస్తున్నారు. ఈ విధానం వల్ల ఎక్కువ టెస్టు సిరీస్‌లు ఆడే ప్రధాన జట్లైన భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు పాయింట్ల విషయంలో అన్యాయం జరుగుతోంది. 

2023–25 డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా జట్టు... ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి ప్రధాన జట్లతో సిరీస్‌లు ఆడకుండానే తుదిపోరుకు అర్హత సాధించింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకపై సిరీస్‌ విజయాలతో పాటు టీమిండియాతో సిరీస్‌ ‘డ్రా’ చేసుకోవడం ద్వారా ముందంజ వేసింది. ఇక ‘స్లో ఓవర్‌ రేట్‌’ జరిమానా విషయంలోనూ దృష్టి సారించే అవకాశం ఉంది. 2023–25 సర్కిల్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఇంగ్లండ్‌ జట్టు 22 పాయింట్లు కోల్పోయింది. ఫలితంగా 41.5 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. 

స్లో ఓవర్‌రేట్‌ను పక్కన పెడితే ఇంగ్లండ్‌ విజయాల శాతం 51.5గా ఉండేది. అప్పుడు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాత పట్టికలో ఇంగ్లండ్‌ మూడో స్థానంలో నిలిచేది. టెస్టు క్రికెట్‌ను రెండంచెలుగా విభజించాలనే అంశంపై ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడే ప్రధాన జట్లను ఒక గ్రూప్‌గా... మిగిలిన జట్లను మరో గ్రూప్‌గా విభజించి మ్యాచ్‌లు నిర్వహించాలని చాన్నాళ్లుగా యోచిస్తున్నప్పటికీ... అది ఇప్పట్లో జరిగే పనిలా లేదు.  

Advertisement
 
Advertisement
Advertisement