
ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్ నిన్న (ఆగస్ట్ 5) ప్రారంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఓవల్ ఇన్విన్సిబుల్స్, లండన్ స్పిరిట్ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇన్విన్సిబుల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. ఇన్విన్సిబుల్స్ బౌలర్లు రషీద్ ఖాన్ (20-15-11-3), సామ్ కర్రన్ (19-10-18-3), జోర్డన్ క్లార్క్ (10-6-8-2) చెలరేగడంతో 94 బంతుల్లో 80 పరుగులకే కుప్పకూలింది. బెహ్రెన్‌డార్ఫ్, నాథన్ సౌటర్ తలో వికెట్ తీశారు.
దారుణంగా విఫలమైన డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్
లండన్ ఇన్నింగ్స్‌లో ఆస్టన్ టర్నర్ (21), ర్యాన్ హిగ్గిన్స్ (12), మ్యాడ్‌సన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతర్జాతీయ స్టార్లు డేవిడ్ వార్నర్ (9), కేన్ విలియమ్సన్ (9) దారుణంగా విఫలమయ్యారు.
ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరిన ఇన్విన్సిబుల్స్
అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుక బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ 24, సామ్ కర్రన్ 14 పరుగులు చేసి ఇన్విన్సిబుల్స్‌ను గెలిపించారు. ఈ జట్టు కేవలం 69 బంతుల్లోనే (4 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని చేరుకుంది. సామ్ బిల్లింగ్స్ 6, డొనొవన్ ఫెరియెరా 9 పరుగులతో అజేయంగా నిలిచారు. లండన్ బౌలర్లలో డాసన్ 2, వార్రల్, టర్నర్ తలో వికెట్ తీశారు.
A fox in the ground during the Hundred Match. 🦊pic.twitter.com/B27FKA6bWw
— Tanuj (@ImTanujSingh) August 5, 2025
మైదానంలోకి గుంట నక్క
ఈ మ్యాచ్ జరుగుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్విన్సిబుల్స్ బ్యాటింగ్ చేస్తుండగా మైదానంలోకి ఓ గుంట నక్క ప్రవేశించింది. ఈ నక్క మైదానమంతా పరుగులు పెడుతూ కాసేపు హల్‌చల్ చేసింది. దీంతో మ్యాచ్‌కు పాక్షిక అంతరాయం కలిగింది.