విధ్వంసం.. రషీద్‌ ఖాన్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన లివింగ్‌స్టోన్‌ | The Hundred 2025: Liam Livingstone Humiliates Rashid Khan With 4,6,6,6,4 In One Over, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

విధ్వంసం.. రషీద్‌ ఖాన్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన లివింగ్‌స్టోన్‌

Aug 13 2025 9:09 AM | Updated on Aug 13 2025 11:14 AM

The Hundred 2025: Liam Livingstone Humiliates Rashid Khan With 4,6,6,6,4 In One Over

హండ్రెడ్‌ లీగ్‌లో ఇంగ్లండ్‌ విధ్వంసకర ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ లీగ్‌లో బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. నిన్న (ఆగస్ట్‌ 12) ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 69  పరగులు చేసి తన జట్టును గెలపించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో లివింగ్‌స్టోన్‌ ఇన్విన్సిబుల్స్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌పై విచక్షణారాహిత్యంగా విరుచుకుపడ్డాడు. వరుసగా ఐదు బంతుల్లో 4,6,6,6,4 (26 పరుగులు) బాదాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా 20 బంతులు వేసిన రషీద్‌.. ఏకంగా 59 పరుగులు సమర్పించుకున్నాడు. 

హండ్రెడ్‌ లీగ్‌లో ఇదే అత్యంత ఖరీదైన స్పెల్‌. రషీద్‌ టీ20 కెరీర్‌లోనూ (హండ్రెడ్‌ మ్యాచ్‌లు టీ20లుగా పరిగణించబడతాయి) ఇవే అత్యంత చెత్త గణాంకాలుగా (20-3-59-0) నిలిచాయి. దీనికి ముందు రషీద్‌ చెత్త టీ20 గణాంకాలు 2018 ఐపీఎల్‌లో (పంజాబ్‌ కింగ్స్‌పై 4 ఓవర్లలో 55 పరుగులు) నమోదయ్యాయి.

తాజాగా రషీద్‌ నమోదు చేసిన అత్యంత చెత్త గణాంకాలు మ్యాచ్‌ స్వరూపానే మార్చేశాయి. 25 బంతుల్లో 61 పరుగులు చేయాల్సిన తరుణంలో లివింగ్‌స్టోన్‌ విధ్వంసం సృష్టించడంతో మ్యాచ్‌ ఫీనిక్స్‌వైపు తిరిగింది. చివరి ఓవర్‌ (5 బంతులు) తొలి రెండు బంతులకు వికెట్లు కోల్పోయినా బెన్నీ హోవెల్‌ బౌండరీని బాది ఫీనిక్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఇన్విన్సిబుల్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 180 పరుగుల భారీ స్కోర్‌ చేసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. లివింగ్‌స్టోన్‌కు ముందు విల్‌ స్మీడ్‌ (29 బంతుల్లో 51; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జో క్లార్క్‌ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఫీనిక్స్‌ గెలుపుకు పునాది వేశారు.

అంతకుముందు ఇన్విన్సిబుల్స్‌.. డొనొవన్‌ ఫెరియెరా (29 బంతుల్లో 63; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపుల అనంతరం నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. జోర్డన్‌ కాక్స్‌ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌ ఆడగా.. ఆఖర్లో రషీద్‌ ఖాన్‌ రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. ఇందులో ఓ సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement