హాంకాంగ్ సిక్సెస్-2025 టోర్నమెంట్లో భారత జట్టు పరాజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే శనివారం నాటి మ్యాచ్‌లలో కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో ఓడిన డీకే సేన... తాజా మ్యాచ్‌లో నేపాల్ చేతిలో (IND vs NEP) ఘోర పరాజయం పాలైంది.
మోంగ్ కాక్ వేదికగా టాస్ గెలిచిన నేపాల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్, కెప్టెన్ సందీప్ జోరా 12 బంతుల్లో 47 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ రషీద్ ఖాన్ కేవలం 17 బంతుల్లోనే 55 పరుగులతో విధ్వంసం సృష్టించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
442కు పైగా స్ట్రైక్‌రేటుతో
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన లోకేశ్ బామ్ కేవలం ఏడు బంతుల్లోనే ఒక ఫోర్, నాలుగు సిక్సర్ల సాయంతో 442కు పైగా స్ట్రైక్‌రేటుతో 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత ఆరు ఓవర్లలో నేపాల్ వికెట్ నష్టపోకుండా ఏకంగా 137 పరుగులు సాధించింది.
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు మూకుమ్మడిగా విఫలమైంది. ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (3 బంతుల్లో 5), భరత్ చిప్లి (5 బంతుల్లో 12) నిరాశపరచగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాంక్ పాంచల్ మూడు బంతుల్లో 12 పరుగులు చేశాడు.
ఇక స్టువర్ట్ బిన్న మరోసారి డకౌట్ కాగా.. కెప్టెన్ దినేశ్ కార్తిక్ (3 బంతుల్లో 7), షాబాజ్ నదీమ్ (4 బంతుల్లో 7) పూర్తిగా తేలిపోయారు. ఈ క్రమంలో మూడు ఓవర్లలోనే భారత జట్టు కథ ముగిసిపోయింది.
45 పరుగులకే భారత్ ఆలౌట్
నేపాల్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగగా.. బాసిర్ రెండు, రూపేశ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో భారత్ కేవలం 45 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా నేపాల్.. భారత జట్టుపై 92 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. దీంతో భారత్ ఖాతాలో హ్యాట్రిక్ ఓటములు జమయ్యాయి. అదికూడా కువైట్, యూఏఈ, నేపాల్ వంటి జట్ల చేతిలో ఎదురుకావడం గమనార్హం.
హాంకాంగ్ సిక్సెస్-2025 భారత్ వర్సెస్ నేపాల్ తుదిజట్లు
భారత్
రాబిన్ ఊతప్ప, భరత్ చిప్లి, స్టువర్ట్ బిన్ని, దినేశ్ కార్తిక్ (కెప్టెన్), ప్రియాంక్ పాంచల్, షాబాజ్ నదీం
బెంచ్: అభిమన్యు మిథున్
నేపాల్
సందీప్ జోరా (కెప్టెన్), రషీద్ ఖాన్, లోకేశ్ బామ్, బాసిర్ అహ్మద్, మొహమ్మద్ ఆదిల్ ఆలం, రూపేశ్ సింగ్
బెంచ్: శరద్ వసావ్కర్.
చదవండి: ఆసీస్‌తో ఐదో టీ20.. భారత తుదిజట్టు ఇదే!.. అతడికి మళ్లీ మొండిచేయి
🚨 Nepal defeated India by 92 runs in the Hong Kong Sixes! 🤯🇳🇵🇮🇳#HongKongSixes pic.twitter.com/LNT87Wre1H
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 8, 2025


