సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓటమి నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సాయి సుదర్శన్ (Sai Sudharsan)ను పక్కనపెట్టడం.. మూడో స్థానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు.
భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కూడా ఈ జాబితాలో చేరాడు. గంభీర్ నిర్ణయం వల్ల వాషింగ్టన్ సుందర్ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. లేనిపోని ఆందోళనలతో అతడు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.
టాపార్డర్‌కు ప్రమోట్
కాగా సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా భారత తుదిజట్టులో తమిళనాడు ప్లేయర్ సాయి సుదర్శన్‌కు చోటు ఇవ్వలేదు. గత కొన్నాళ్లుగా మూడో స్థానంలో ఆడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను కాదని.. మరో తమిళనాడు ఆటగాడు, ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేశారు.
ఈ క్రమంలో.. బ్యాటింగ్‌కు అనుకూలించని పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 29, రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులతో ఫర్వాలేదనిపించాడు వాషీ. అయితే, బంతితో మాత్రం ఈ స్పిన్ ఆల్‌రౌండర్ రాణించలేకపోయాడు. ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క ఓవర్ వేసి మూడు పరుగులు ఇచ్చిన వాషీకి.. రెండో ఇన్నింగ్స్‌లో అసలు బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్.. టెస్టు ప్లేయర్.. అతడు బ్యాటింగ్ చేయగల బౌలరా? అతడిని మీరు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. తద్వారా.. పరోక్షంగా ‘నువ్వు బ్యాటింగ్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టు’ అనే సందేశం ఇచ్చారు.
అతడి భవిష్యత్తును నాశనం చేస్తారా?
బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో గంటలు గంటలు తలమునకలైదే.. బౌలింగ్ ప్రాక్టీస్ తగ్గించాల్సి వస్తుంది. రెండూ సమానంగా చేయాలంటే శారీరకంగా మరింత శ్రమించక తప్పదు. టాపార్డర్‌కు ప్రమోట్ చేయడం ద్వారా.. ‘నీ నుంచి ఎక్కువ పరుగులు ఆశిస్తున్నాం’ అని చెబితే.. అతడు గందరగోళానికి గురవ్వచ్చు.
అతడి భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారవచ్చు’’ అంటూ గంభీర్ తీరును డీకే విమర్శించాడు. కాగా తొలి టెస్టులో టీమిండియా సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇరుజట్ల మధ్య గువాహటి వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు ఆరంభానికి షెడ్యూల్ ఖరారైంది.
ఇదిలా ఉంటే.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 16 టెస్టులు ఆడాడు. ఓ సెంచరీ సాయంతో టెస్టుల్లో 821 పరుగులు చేసిన వాషీ.. ఇప్పటికి 35 వికెట్లు పడగొట్టాడు.


