Sakshi News home page

కోహ్లిలా ఉంటే రోహిత్‌ మరో వరల్డ్‌కప్‌ ఆడటం ఖాయం: ముత్తయ్య మురళీధరన్‌

Published Sat, Nov 25 2023 12:40 PM

He Will Definitely Play Another World Cup: Muttiah Muralitharan on Rohit Sharma - Sakshi

Rohit Sharma- T20I Future: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో వరల్డ్‌కప్‌ ఆడే సత్తా ఉన్నవాడేనని శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ అన్నాడు. విరాట్‌ కోహ్లి మాదిరి ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే కచ్చితంగా టీ20 ప్రపంచకప్‌-2024లో అతడు ఆడతాడని అభిప్రాయపడ్డాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ దాకా అజేయంగా నిలిచిన టీమిండియా.. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తప్పక అందుతుందనుకున్న ట్రోఫీ చేజారడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, ఇతర ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు.

ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి సంసిద్ధమయ్యే క్రమంలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి గత ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరమయ్యారు. ఈ క్రమంలో ప్రపంచకప్‌ ఓటమి తర్వాత వీరిద్దరు ఇంటర్నేషనల్‌ పొట్టి ఫార్మాట్‌ నుంచి పూర్తిగా తప్పుకొనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వన్డే వరల్డ్‌కప్‌లో అద్భుతంగా ఆడాడు
ఈ నేపథ్యంలో ముత్తయ్య మురళీధరన్‌ రోహిత్‌ కెరీర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో అతడి ప్రదర్శన అద్భుతంగా ఉంది. మెరుగైన స్ట్రైక్‌రేటుతో అతడి బ్యాటింగ్‌ సాగింది.

ఈవెంట్‌ మొత్తంలో అతడు ఒక్కసారిగా వైఫల్యం చెందిన సందర్భం లేదు. అతడికి ఇప్పుడు కేవలం 36 ఏళ్లే.. అంటే ఇంకా యువకుడనే అర్థం. విరాట్‌ కోహ్లి మాదిరి ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే కచ్చితంగా ఇంకో వరల్డ్‌కప్‌ ఆడే అవకాశం ఉంది.

ఇంకా యువకుడే.. కోహ్లిలా ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే
వన్డేల్లో అతడి స్ట్రైక్‌రేటు 130కిపైగానే.. టీ20లలో కూడా మెరుగైన గణాంకాలే కలిగి ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా తనకెంతో అనుభవం ఉంది. ఏ ఆటగాడైనా 35 ఏళ్ల తర్వాత కూడా కొనసాగాలనుకుంటే ఫిట్‌నెస్‌ కాపాడుకోవాల్సి ఉంటుంది.

కాబట్టి రోహిత్‌ ఆడాలని భావిస్తే తప్పక ఆ దిశగా మరింత కష్టపడతాడు. నాకు తెలిసి తను మరో వరల్డ్‌కప్‌ ఆడటానికి కచ్చితంగా సిద్ధమవుతాడు’’ అని ముత్తయ్య మురళీధరన్‌ పేర్కొన్నాడు. కాగా అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్‌కప్‌-2024 జూన్‌ 4న మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. యంగ్‌ టీమిండియా ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉంది.

చదవండి: వాళ్లిద్దరు రిటైర్మెంట్‌ ప్రకటిస్తేనే తప్ప: ఆశిష్‌ నెహ్రా కీలక వ్యాఖ్యలు

Advertisement

What’s your opinion

Advertisement