
టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)పై భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ప్రశంసలు కురిపించాడు. టెస్టు క్రికెట్‌లో జడ్డూ ప్రపంచంలోనే ఉత్తమ ఆల్‌రౌండర్ అని కొనియాడాడు. ఇంగ్లండ్ గడ్డ మీద బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి కంటే.. జడ్డూ ఎక్కువే పరుగులే రాబట్టాడని పేర్కొన్నాడు.
కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు గెలవగా.. రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించింది గిల్ సేన.
పోరాడిన జడేజా
అయితే, లార్డ్స్ టెస్టులో ఆఖరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో ఓడిపోయే క్లిష్ట పరిస్థితుల్లో రవీంద్ర జడేజా (181 బంతుల్లో 61 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. ఈ నేపథ్యంలో సురేశ్ రైనా జడ్డూను ప్రశంసిస్తూనే.. కాస్త వేగంగా ఆడి ఉంటే బాగుండేదని విమర్శించాడు.

కోహ్లి కంటే అతడే ఎక్కువ పరుగులు చేశాడు
ఈ మేరకు.. ‘‘ఇంగ్లండ్‌లో విరాట్ కోహ్లి కంటే రవీంద్ర జడేజా ఎక్కువ పరుగులు స్కోరు చేశాడు. ఇద్దరి మధ్య హాఫ్ సెంచరీల సంఖ్యలో వ్యత్యాసం మీకు కనిపిస్తుంది. ఇక టెస్టు క్రికెట్‌లో ప్రపంచంలోనే జడేజా అత్యుత్తమ ఆల్‌రౌండర్.
ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమంగా రాణిస్తూ క్లిష్ట పరిస్థితుల్లో జట్టును కాపాడతాడు. లార్డ్స్ టెస్టులో ఒకానొక సందర్భంలో మనం 100 పరుగుల తేడాతో ఓడిపోతాం అనిపించింది. అయితే, పట్టుదలగా అతడు ఆఖరి వరకు నిలబడిన తీరు అమోఘం.
అయితే, జడ్డూ కాస్త రిస్క్ తీసుకుని ఆడి ఉంటే విజయ లాంఛనం పూర్తి చేసేవాడేమో! బుమ్రా క్రీజులో ఉన్నంత సేపు జడ్డూకు ఆ అవకాశం ఉండేది. కొన్ని ఫోర్లు, సిక్సర్లు బాదితే బాగుండేది’’ అని సురేశ్ రైనా స్పోర్ట్‌తక్‌తో పేర్కొన్నాడు. కాగా లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇరుజట్ల మధ్య నాలుగో టెస్టు (జూలై 23-27)కు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం వేదిక.
ఏడు హాఫ్ సెంచరీలు
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ గడ్డ మీద భారత మాజీ టెస్టు బ్యాటర్ కోహ్లి 33 ఇన్నింగ్స్‌లో కలిపి 1096 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు.. కోహ్లికి సమకాలీనుడైన జడ్డూ 29 ఇన్నింగ్స్ ఆడి.. ఓ సెంచరీ, ఏడు హాఫ్ సెంచరీల సాయంతో 969 పరుగులు సాధించాడు. తాజా సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి జడేజా ఇప్పటికి 327 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
చదవండి: BCCI: నితీశ్ రెడ్డితో పాటు అతడూ అవుట్.. జట్టులోకి కొత్త ప్లేయర్