BCCI: నితీశ్‌ రెడ్డితో పాటు అతడూ అవుట్‌.. జట్టులోకి కొత్త ప్లేయర్‌ | Arshdeep Ruled Out of 4th Test Nitish Reddy Out Of Series Anshul In: BCCI | Sakshi
Sakshi News home page

BCCI: నితీశ్‌ రెడ్డితో పాటు అతడూ అవుట్‌.. జట్టులోకి కొత్త ప్లేయర్‌

Jul 21 2025 12:25 PM | Updated on Jul 21 2025 1:14 PM

Arshdeep Ruled Out of 4th Test Nitish Reddy Out Of Series Anshul In: BCCI

ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు (IND vs ENG)కు ముందు టీమిండియాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రిషభ్‌ పంత్‌ (Rishbah Pant) వేలి గాయంతో కేవలం బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని తెలుస్తుండగా.. యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

ఎడమ మెకాలికి గాయమైన కారణంగా ఈ ఆంధ్రా కుర్రాడు.. ఇంగ్లండ్‌ నుంచి తిరిగి స్వదేశానికి రానున్నాడు. మరోవైపు.. యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా మాంచెస్టర్‌ టెస్టుకు దూరమయ్యాడు. బెకెన్‌హామ్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సందర్భంగా అతడి ఎడమ చేతి వేలికి గాయమైంది.

నాలుగో టెస్టుకు దూరం
ఈ క్రమంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో అర్ష్‌దీప్‌ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, ఈ పంజాబీ బౌలర్‌ ఇప్పట్లో కోలుకునేలా లేడు. అందుకే నాలుగో టెస్టుకు అతడు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అన్షుల్‌ కంబోజ్‌ను జట్టుకు ఎంపిక చేసింది. మాంచెస్టర్‌ టెస్టు సందర్భంగా అతడు జట్టుతో చేరనున్నాడు. ఇందుకు సంబంధించి బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గాయాల బెడద
కాగా శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే మూడు పూర్తికాగా ఆతిథ్య ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. 

ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రాత్మ​ విజయం సాధించిన టీమిండియా.. మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)నూ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే, ఈ వేదికపై ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు గెలవకపోవడం.. పైగా ఇలా గాయాల బెడద వేధిస్తుండటం ఆందోళనకరంగా మారింది.

ఇదిలా ఉంటే.. లీడ్స్‌లో ఆడిన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు బదులు.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి రెండో టెస్టు నుంచి జట్టులోకి వచ్చాడు. అయితే, అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. చివరగా లార్డ్స్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా కేవలం 43 పరుగులే చేశాడు.

మరోవైపు.. టీమిండియా తరఫున టీ20, వన్డేలలో అదరగొడుతున్న అర్ష్‌దీప్‌ ఇంత వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఇక హర్యానాకు చెందిన అన్షుల్‌ కాంబోజ్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో భారత్‌-‘ఎ’ జట్టు తరఫున అనధికారిక సిరీస్‌ ఆడాడు. 

నార్తాంప్టన్‌లో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లు తీసిన అన్షుల్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో వచ్చి అజేయ అర్ధ శతకం (51) సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీయడంతో ఆపటు 486 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత జట్టు (అప్‌డేటెడ్‌ ):
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌ & వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.

చదవండి: BAN vs PAK: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement