
మిర్పూర్: బౌలర్లు విజృంభించడంతో సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 (BAN vs PAK)లో బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచి 1–0తో ఆధిక్యంలో నిలిచింది.
110 పరుగులకే ఆలౌట్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 19.3 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... అబ్బాస్ అఫ్రిది (22; 3 సిక్స్‌లు), ఖుష్‌దిల్ షా (17; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
కెప్టెన్ సల్మాన్ ఆఘా (3)తో పాటు సయీమ్ అయూబ్ (6), హరీస్ (4), హసన్ నవాజ్ (0), మొహమ్మద్ నవాజ్ (3) పెవిలియన్‌కు వరుస కట్టారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్ 3, ముస్తఫిజుర్ రహమాన్ 2 వికెట్లు పడగొట్టారు.
పర్వేజ్ ఫిఫ్టి
ముఖ్యంగా ముస్తఫిజుర్ పాక్ బ్యాటర్లను వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ ఆటగాళ్లలో ముగ్గురు రనౌట్ రూపంలో వెనుదిరిగారు.
అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పర్వేజ్ హుసేన్ (Parvez Hossain Emon) (39 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో అదరగొట్టగా... తౌహిద్ హృదయ్ (37 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 2 వికెట్లు పడగొట్టాడు.
నాలుగో విజయం
టీ20 ఫార్మాట్‌లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ నెగ్గిన మ్యాచ్‌లు. ఇప్పటిదాకా పాక్‌తో 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ నాలుగింటిలో మాత్రమే నెగ్గింది. 2015, 2016లలో మిర్పూర్‌లోనే జరిగిన మ్యాచ్‌ల్లో గెలిచిన బంగ్లాదేశ్... 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చివరిసారి టీ20ల్లో పాక్‌ను ఓడించింది.