
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో సమంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన భారత జట్టు సిరీస్‌ను సమం చేసింది. ఓవల్ టెస్టులో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
అదేవిధంగా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. ఎప్పటినుంచో వస్తున్న అనవాయితీ ప్రకారం ఇరు జట్ల ప్రధాన కోచ్‌లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించారు.
ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టీమిండియా కెప్టెన్ గిల్‌ను ఎంపిక చేయగా.. భారత ప్రధాన కోచ్ ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌ను ఎంచుకున్నాడు. అయితే గంభీర్ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సిరీస్ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన స్టార్ బ్యాటర్ జో రూట్‌ను కాదని బ్రూక్‌ను సెలక్ట్ చేయడం చాలా మంది తప్పుబట్టారు. గంభీర్ నిర్ణయంతో బ్రూక్ కూడా షాకయ్యాడంట.
ఇదే విషయంపై బీబీసీతో బ్రూక్ మాట్లాడుతూ.. "నేను ఈ సిరీస్‌లో అంత మెరుగ్గా రాణించలేకపోయాను. జో రూట్ లాగా ఎక్కువ పరుగులు కూడా చేయలేకపోయాను. కాబట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు అతడే ఆర్హుడు. అతడే మ్యాన్ ఆఫ్‌ది సిరీసే కాదు, మ్యాన్ ఆఫ్‌ది సమ్మర్ కూడా.
రూట్ ఎన్నో ఏళ్లగా జట్టుకు తన సేవలను అందిస్తూ వస్తున్నాడు" చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ 537 పరుగులు చేయగా.. బ్రూక్ 481 రన్స్ చేశాడు. శుబ్‌మన్ అయితే ఏకంగా నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేశాడు.
చదవండి: నువ్వు గొప్పోడివి సిరాజ్: విరాట్ కోహ్లి అక్క భావన పోస్ట్ వైరల్