హార్దిక్ పాండ్యా (PC: BCCI)
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అతడు అఫ్గానిస్తాన్‌తో జరిగే సిరీస్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా ఐపీఎల్-2026 తర్వాత ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున ఆడనేలేదు.
వెన్ను నొప్పి
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ సందర్భంగా హార్దిక్ ఆఖరిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ సమయంలో వెన్ను నొప్పితో బాధపడ్డ ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. ముంబై ఇండియన్స్ తరఫున లీగ్ దశలో పద్నాలుగింట పది మాత్రమే ఆడాడు.
తొడ కండరాల గాయం
ఆ తర్వాత తొడ కండరాల గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో హార్దిక్ పాండ్యా పాల్గొనలేకపోయాడు. మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం కావడంతో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందాడు.
మళ్లీ ఇలా..
అక్కడ క్రమక్రమంగా కోలుకున్న హార్దిక్ పాండ్యా.. జాతీయ జట్టులో పునరాగమనం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే, అంతలోనే మళ్లీ మోకాలికి గాయమైంది. దీంతో అఫ్గానిస్తాన్‌తో సెప్టెంబరులో జరిగే టీ20 సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడనే వార్తలు తెరమీదకు వచ్చాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ‘‘హార్దిక్ పూర్తిగా కోలుకున్నట్లే. అతడు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే, బౌలింగ్ చేసే సమయంలో అతడు మోకాలి నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత కాసేపటికే కోలుకున్నప్పటికీ.. మ్యాచ్ ఫిట్‌నెస్ మాత్రం సాధించలేకపోయాడని తెలిసింది.
బ్యాటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బృందం మాత్రం హార్దిక్ పూర్తిగా కోలుకున్నాడని భావిస్తేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఏదేమైనా అఫ్గాన్‌తో సిరీస్‌కు హార్దిక్ అందుబాటులో ఉండటం కష్టమే’’ అని తెలుస్తోంది.
హార్దిక్ కెరీర్ ఖతమే?
హార్దిక్ పాండ్యాకు గాయాలు కొత్త కాదు. గతంలోనూ అతడు తీవ్రగాయాల పాలైనా తిరిగి కోలుకుని మెగా టోర్నీల్లో సత్తా చాటాడు. అరుదైన పేస్ నైపుణ్యాలున్న ఆల్‌రౌండర్ కావడం వల్ల హార్దిక్ స్థానానికి గతంలో పెద్దగా సవాలు ఎదురుకాలేదు.
అయితే, నితీశ్ కుమార్ రెడ్డి రాకతో పరిస్థితి కాస్త మారింది. హార్దిక్‌కు అతడే సరైన వారసుడు అని మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. యాజమాన్యం కూడా హార్దిక్ స్థానాన్ని భర్తీ చేసేలా నితీశ్‌ను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది.
ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఇలాగే తరచూ గాయపడితే నితీశ్ రెడ్డికి మార్గం పూర్తిగా సుగమమవుతుంది. ఇప్పటికే టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకునే దిశగా పయనిస్తున్న నితీశ్ రెడ్డి.. వైట్‌బాల్ జట్టులోనూ కీలకంగా మారగలడు.
కానీ, నితీశ్ కూడా తరచూ గాయపడుతుండటం గమనార్హం. అయితే, ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోనే ఉన్న అతడు అఫ్గాన్‌తో సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా 2025 జనవరిలో నితీశ్ చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఇదిలా ఉంటే.. వాషింగ్టన్ సుందర్ కూడా కోలుకుని అఫ్గాన్‌తో సిరీస్ (సెప్టెంబరు 13-17) ఆడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
చదవండి: ‘నువ్వెంతగా కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’


