
Photo Courtesy: BCCI
గుజరాత్ టైటాన్స్ జట్టు పొట్టి క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 18) ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన ఈ జట్టు.. పాకిస్తాన్ తర్వాత టీ20ల్లో 200, అంతకుమించిన లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించిన రెండో జట్టుగా నిలిచింది. యావత్ టీ20 ఫార్మాట్ చరిత్రలో ఈ రెండు జట్లే (పాకిస్తాన్, గుజరాత్) ఇప్పటివరకు 200, అంతకుమించిన లక్ష్యాలను వికెట్ కోల్పోకుండా ఛేదించాయి.
2022లో పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో 200కు పైగా లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఆ మ్యాచ్‌లో నాటి పాక్ కెప్టెన్ అజేయమైన సెంచరీతో (66 బంతుల్లో 110) విధ్వంసం సృష్టించగా.. అతని పార్ట్‌నర్, ప్రస్తుత కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో (51 బంతుల్లో 88 నాటౌట్) చెలరేగాడు.
నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ 5, అభిషేక్ పోరెల్ 30, అక్షర్ పటేల్ 25, ట్రిస్టన్ స్టబ్స్ 21 (నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఓపెనర్లు సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్‌లో గిల్-సాయి సుదర్శన్ నెలకొల్పిన 205 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యంగా రికార్దైంది. ఈ సీజన్‌లో గిల్-సాయి జోడీ 839 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. లీగ్ చరిత్రలోనే ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు జోడించిన భారత జోడీగా రికార్డుల్లోకెక్కింది.