క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా విచిత్ర పరిస్థితి | Good Weather Stops T20 Blast 2025 Play Between Kent Spitfires And Gloucestershire | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా విచిత్ర పరిస్థితి

Jun 19 2025 12:25 PM | Updated on Jun 19 2025 12:53 PM

Good Weather Stops T20 Blast 2025 Play Between Kent Spitfires And Gloucestershire

ఇటీవల జరిగిన ఓ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. సానుకూల వాతావరణం కారణంగా మ్యాచ్‌ వాయిదా పడింది. సాధారణంగా సానుకూల వాతావరణంలో క్రికెట్‌ మ్యాచ్‌లు  సజావుగా సాగుతాయి. ప్రతికూల వాతావరణం​ ఉంటేనే మ్యాచ్‌లు వాయిదా పడటం కాని, రద్దు కావడం కాని జరుగుతుంది. అయితే ఈ ఉదంతంలో పరిస్థితి భిన్నంగా ఉంది. సానుకూల వాతావరణం ఉన్నా మ్యాచ్‌ వాయిదా పడింది.

ఇంగ్లండ్‌ టీ20 బ్లాస్ట్‌ టోర్నీలో కెంట్‌ స్పిట్‌ఫైర్స్‌, గ్లోసెస్టర్‌షైర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కెంట్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని గ్లెసెస్టర్‌షైర్‌ ఛేదిస్తుండగా భారీగా ఎండ కాసింది. సూర్య కిరణాలు నేరుగా ఆటగాళ్ల కళ్లపై పడ్డాయి. దీంతో మ్యాచ్‌ను పాక్షికంగా వాయిదా వేశారు. ఎనిమిది నిమిషాల తర్వాత ఎండ ప్రభావం తగ్గడంతో మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించారు.

అనుకూలమైన వాతావరణం ఉన్నా మ్యాచ్‌ వాయిదా పడ్డ విషయం తెలిసి ఉపఖండంలోని క్రికెట్‌ అభిమానులు అవాక్కయ్యారు. భారత్‌ లాంటి దేశాల్లో ఎంత ఎండ ఉంటే మ్యాచ్‌లు అంత సజావుగా సాగుతాయి. ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు ఉన్నా ఉపఖండపు దేశాల్లో క్రికెట్‌ మ్యాచ్‌కు అనుకూలమైన వాతావరణంగానే పరిగణిస్తారు.

అయితే ఇంగ్లండ్‌ లాంటి దేశాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఇంగ్లండ్‌లో ఎండలు ఎక్కువగా ఉండవు. ఈ వాతావరణానికి అలవాటు పడ్డ ఆటగాళ్లు, కొద్దిపాటి ఎండకే బెంబేలెత్తిపోతుంటారు. ఉపఖండంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోడం చాలా సార్లు చూసుంటాము.

మ్యాచ్‌ విషయానికొస్తే.. కెంట్‌పై గ్లోసెస్టర్‌షైర్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కెంట్‌.. ఫించ్‌ (42), బిల్లింగ్స్‌ (38), ముయేయే (33) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గ్లోసెస్టర్‌షైర్‌.. జాక్‌ టేలర్‌ (54 నాటౌట్‌), ఓలివర్‌ ప్రైస్‌ (41 నాటౌట్‌) రాణించడంతో మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.  

 

Advertisement
 
Advertisement
Advertisement