
10,000 మీటర్ల పరుగులో పసిడి కైవసం
20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో సెబాస్టియన్‌కు కాంస్యం
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ గుల్‌వీర్ సింగ్ పసిడి పతకంతో సత్తా చాటాడు. 10,000 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ అగ్ర స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో భారత్‌కు చెందిన సెర్విన్ సెబాస్టియన్ కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో పోటీల తొలి రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన 26 ఏళ్ల గుల్‌వీర్... మంగళవారం 10,000 మీటర్ల రేసును 28 నిమిషాల 38.63 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం గెలుచుకున్నాడు.
గుల్‌వీర్‌కు ఇదే తొలి ఆసియా చాంపియన్‌షిప్ స్వర్ణం. మెబుకి సుజుకి (28 నిమిషాల 43.84 సెకన్లు; జపాన్), అల్బర్ట్ రోప్ (28 నిమిషాల 46.82 సెకన్లు; బహ్రెయిన్) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. భారత్‌కే చెందిన సావన్ బర్వాల్ 28 నిమిషాల 50.53 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి రోజు పోటీలు ముగిసేసరికి భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో పతకాల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 5 స్వర్ణాలు, 2 రజతాలతో చైనా నంబర్‌వన్‌గా ఉండగా... 3 రజతాలు, 2 కాంస్యాలతో జపాన్ మూడో స్థానంలో ఉంది.
చివరి 200 మీటర్లలో వేగం పెంచి..
ఉత్తరప్రదేశ్‌లోని నిరుపేద రైతు కుటుంబానికి చెందిన గుల్‌వీర్ సింగ్ ఇప్పటికే జాతీయ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో అతడు 10,000 మీటర్ల రేసును 27 నిమిషాల 00.22 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. మంగళవారం రేసులో చివరికి వచ్చేసరికి మూడో స్థానంలో కనిపించిన గుల్‌వీర్... మరో 200 మీటర్లలో రేసు ముగుస్తుందనగా వేగం పెంచాడు. ఒక్కొక్క సహచరుడిని వెనక్కి నెడుతూ చిరుతలా దూసుకొచ్చాడు. ఆఖరి వరకు అదే కొనసాగిస్తూ ఫినిషింగ్ లైన్ దాటాడు.
‘విజేతగా నిలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగా. టైమింగ్‌పై కాకుండా అందరికంటే ముందుండాలని అనుకున్నా. స్వర్ణం గెలవడం ఆనందంగా ఉంది. దీంతో నా ర్యాంకింగ్ మరింత మెరుగవనుంది. ఈ ఏడాది సెపె్టంబర్‌లో టోక్యో వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించడానికి అది తోడ్పడనుంది’అని గుల్‌వీర్ పేర్కొన్నాడు.
భారత్ నుంచి 1975లో హరిచంద్, 2017 లక్ష్మణన్ పసిడి పతకాలు గెలవగా... ఇప్పుడు గుల్‌వీర్ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 5000 మీటర్ల పరుగులోనూ జాతీయ రికార్డు కలిగిన గుల్‌వీర్ ఇక్కడ కూడా ఆ విభాగంలో పోటీపడనున్నాడు. 2023 ఆసియా చాంపియన్‌షిప్ 5000 మీటర్ల పరుగులో గుల్‌వీర్ కాంస్యం నెగ్గగా... ఇప్పుడు పతకం రంగు మార్చాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.
డెకాథ్లాన్‌లో తేజస్విన్ దూకుడు...
భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ డెకథ్లాన్ (100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్‌పుట్, హై జంప్, 400 మీటర్ల పరుగు, 110 మీటర్ల హర్డిల్స్, డిస్కస్ త్రో, పోల్ వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్ల పరుగు)లో సత్తాచాటుతున్నాడు. పోటీల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన ఐదు ఈవెంట్‌లలో శంకర్ దుమ్మురేపాడు. దీంతో సగం పోటీలు ముగిసేసరికి తేజస్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
పురుషుల 400 మీటర్ల పరుగులో విశాల్ ఫైనల్‌కు చేరగా... మహిళల 400 మీటర్ల పరుగులో రూపాల్ చౌధరీ, విదయ రామ్‌రాజ్ తుది రేసుకు అర్హత సాధించారు. పురుషుల హై జంప్‌లో భారత అథ్లెట్ అనిల్ కుషారె 2.10 మీటర్ల ఎత్తు దూకి ఫైనల్‌కు అర్హత సాధించాడు. పురుషుల 1500 మీటర్ల రేసులో యూనుస్ షా ఫైనల్‌కు చేరాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్ను రాణి నాలుగో స్థానంలో నిలిచి పతకానికి దూరమైంది.
సెబాస్టియన్‌కు కాంస్యం
పురుషుల 20 కిలోమీటర్ల రేస్‌వాక్‌లో సెబాస్టియన్ 1 గంట 21 నిమిషాల 13.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచాడు. ‘పతకం నెగ్గడం సంతోషంగా ఉంది. విజేతల మధ్య పెద్ద అంతరం లేదు. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఇదే నా తొలి పతకం’అని సెబాస్టియన్ అన్నాడు.

వాంగ్ జవో (1 గంట 20 నిమిషాల 36.90 సెకన్లు; చైనా), కెంటా యొషికవా (1 గంట 20 నిమిషాల 44.90 సెకన్లు; జపాన్) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత వాకర్ అమిత్ 1 గంట 22 నిమిషాల 14.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఐదో స్థానంలో నిలిచాడు.