PC: CPL X
న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతం చేశాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్-2026లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ట్రింబాగో నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ట్రినిడాడ్ వేదికగా టాస్ గెలిచిన ట్రింబాగో నైట్‌రైడర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
షిమ్రన్ హెట్‌మెయిర్ విధ్వంసకర శతకం
వర్షం అంతరాయం కలిగించిన కారణంగా ఈ మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించగా.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమెజాన్ వారియర్స్ ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్లలో గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ కాగా.. మాథ్యూ నందు 13 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షాయీ హోప్ (16) నిరాశపరచగా.. కెప్టెన్ షిమ్రన్ హెట్‌మెయిర్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు.
కేవలం 43 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్లు బాది హెట్‌మెయిర్ 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్ (7 బంతుల్లో 27 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ట్రింబాగో ఆదిలో కష్టాలు ఎదుర్కొంది. ఓపెనర్లలో కొలిన్ మున్రో 22 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. సునిల్ నరైన్ (1) పూర్తిగా విఫలమయ్యాడు.
ఒంటిచేత్తో అద్భుతం
డ్వేన్ ప్రిటోరియస్ బౌలింగ్‌లో నరైన్ బంతిని గాల్లోకి లేపగా.. డీప్ మిడ్ వికెట్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ అనూహ్య రీతిలో.. రెప్పపాటులో ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే, తాను నిజంగానే బంతిని అందుకున్నానా? అన్నట్లుగా ఫిలిప్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కాసేపు నిశ్చేష్టుడైపోయాడు.
Glenn Phillips! Stop That! 🤯🤯🤯
A crazy one-handed catch from Phillips! 🇹🇹 x 🇬🇾#CPL26 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/eFHMjjWf6U— CPL T20 (@CPL) September 1, 2026
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘నిజంగానే నువ్వు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడివి. ఈ విషయాన్ని మరోసారి నిరూపించావు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పూరన్, హేల్స్ మెరుపులు వృథా
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ట్రింబాగో కెప్టెన్ నికోలస్ పూరన్ (16 బంతుల్లో 43), అలెక్స్ హేల్స్ (24 బంతుల్లో 55) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. జోషువా డా సిల్వ (5 బంతుల్లో 13 నాటౌట్) వారికి సహకారం అందించాడు.
ఈ క్రమంలో నిర్ణీత 16 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి ట్రింబాగో నైట్ రైడర్స్ 172 పరుగులు చేయగలిగింది. కానీ డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఫలితంగా అమెజాన్ వారియర్స్ తొమ్మిది పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సెంచరీ వీరుడు షిమ్రన్ హెట్‌మెయిర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
చదవండి: ‘నువ్వెంత కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’


