సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆడతాడా? లేదా? అన్న సందిగ్దం నెలకొంది. కోల్‌కతాలో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పి కారణంగా గిల్ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యాడు.
అయితే, గిల్ మెడ నొప్పి మాత్రం పూర్తిగా తగ్గలేదు. ఇంకా పూర్తిస్థాయిలో మ్యాచ్ ఫిట్‌నెస్ కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలోనే అతడు గువాహటి టెస్టు ఆడడనే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ (Sitanshu Kotak) గురువారం స్పందించాడు.
కెప్టెన్ కోలుకుంటున్నాడు
‘‘గిల్ కోలుకుంటున్నాడు. నిన్ననే అతడిని కలిశాను. తనకు పెద్దగా సమస్య లేదు. అయితే, అతడు ఆడతాడా? లేదా అన్న అంశంపై శుక్రవారం సాయంత్రమే స్పష్టత వస్తుంది. ఫిజియోలు, డాక్టర్ల నిర్ణయాన్ని బట్టే అతడి ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.
ప్రస్తుతానికి గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. కానీ మ్యాచ్ సమయంలో నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశాలను కొట్టిపడేయలేము. ఒకవేళ ఏదైనా తేడా అనిపిస్తే కచ్చితంగా అతడికి విశ్రాంతినిస్తాం. ఏదేమైనా కీలక బ్యాటర్, కెప్టెన్‌గా గిల్ సేవల్ని మాత్రం మేము కోల్పోతాము.
అయినా మరేం పర్లేదు. ఒకవేళ గిల్ ఆడకపోయినా.. మాకు చాలా మంది బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. వాళ్లంతా ప్రొఫెషనల్ ఆటగాళ్లే. జట్టు కోసం వచ్చి ఆడతారు. గిల్ ఆడాలనే మేమూ కోరుకుంటున్నాం. అయితే, అతడి ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత. గిల్ స్థానంలో వచ్చే ఆటగాడు సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
గిల్ స్థానంలో అతడే ఆడతాడు
గిల్ ఆడే నాలుగో స్థానంలో ధ్రువ్ జురెల్ అందుబాటులో ఉండనే ఉన్నాడు. అయితే, గిల్ ప్లేస్‌లో తుదిజట్టులోకి ఎవరు వస్తారనేది రేపే నిర్ణయిస్తాం’’ అని సితాన్షు కొటక్ తెలిపాడు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య శనివారం నుంచి మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక.
ఇదిలా ఉంటే.. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. గువాహటిలో గెలిస్తేనే రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేయగలదు.
చదవండి: IPL 2026: ‘సన్‌రైజర్స్‌కు అతడు దొరకడు.. బ్యాటింగ్ ఒక్కటే సరిపోదు.. కాబట్టి’


